Thursday, October 29, 2015

వందేళ్ల చరిత్రలేని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరాలు

వందేళ్ల చరిత్రలేని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరాలు


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న కొన్ని ప్రముఖ నగరాలకు కనీసం వందేళ్లు కూడా చరిత్ర లేదు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ నగరాలు కొద్దికాలంలోనే మహానగరాలుగా మారి....విశ్వఖ్యాతిని ఆర్జించాయి. అలాంటి ప్రముఖ నగరాలను కొన్నింటిని పరిశీలిద్దాం...


అట్లాంటా(అమెరికా)

అమెరికాలో ప్రముఖ ప‌ర్యాటక నగరంగా పేరొందిన అట్లాంటా
1854లో ఏర్పడింది. అప్పట్లో అది మూడు పట్టణాల సముదాయంగా ఉండేది. నూయార్క్‌లోని కుబేరులకు విహార యాత్రా స్థలంగా మొదట ఈ నగరం రూపుదిద్దుకుంది. ఎన్నో రిసార్ట్‌లను ఇక్కడ నిర్మించారు. 1874 నుంచి ఏడాదికి దాదాపు 5 లక్షల మంది పర్యాటకులను ఈ నగరంఆకర్షిస్తోంది.ఆ తర్వాత అట్లాంటా అనూహ్యంగా అభివృద్ధి చెంది మహానగరంగా రూపుదిద్దుకుంది. ఒలింపిక్స్‌కు కూడా అతిథ్యమిచ్చింది. జూద క్రీడకు ఈ నగరం పేరెన్నికగన్నది.

దుబాయి(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌)


సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇప్పుడున్న దుబాయి నగరం పూర్తిగా ఓ ఎడారి ప్రాంతం. 1900లో ఇరాన్‌తో వాణిజ్యానికి ఇది ప్రధాన నౌకాకేంద్రంగా ఉండేది. 1960 నుంచి దుబాయ్‌....అనేక అంతర్జాతీయ కంపెనీలకు గమ్యస్థానంగా మారింది. మౌలిక సదుపాయాలు అద్భుత రీతిలో అభివృద్ధి చెంది ఎన్నో ఆకాశహర్మ్యాలు వెలిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో దుబాయ్ ఎదిగింది. 2013 నుంచి ప్రపంచంలో పర్యాటకులు ఎక్కువ సందర్శిస్తున్న నగరాల జాబితాలో దుబాయ్‌ ఏకంగా ఏడోస్థానాన్ని ఆక్రమించింది.


లాస్‌ వెగాస్‌(అమెరికా)

ప్రపంచంలో వేడుకల రాజధానిగా ఖ్యాతినార్జించిన అమెరికాలోని లాస్‌వెగాస్‌ నగరాన్ని 1905లో నిర్మించారు. 24 ఏళ్ల తర్వాత నెవడా జూదాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత లాస్‌వెగాస్‌ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన జూదగాళ్లకు ఇది కేంద్రంగా మారింది. ఆబాలగోపాలాన్ని అలరించేలా ఈ నగరం రూపుదిద్దుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

కాన్‌కన్‌ (మెక్సికో)




ప్రస్తుతం ప్రపంచంలో విహార యాత్రలకు అత్యుత్తమ విడిదిగా పేరుగాంచిన మెక్సికోలోని కాన్‌కన్‌ నగరంలో.....45 ఏళ్ల క్రితం కేవలం ఇసుక మాత్రమే ఉండేది. కానీ మెక్సికో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి కాన్‌కన్‌ను పర్యాటక నగరంగా మార్చింది. ఇప్పుడు ఈ నగరంలో 200కిపైగా స్టార్‌ హోటళ్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సుకు ఇది అతిథ్యమిచ్చింది. మెక్సికోలోని ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాల్లో కాన్‌కన్‌ ఒకటి. ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలు సెలెనా గోమెజ్‌, అడం సాండ్లర్, సెత్‌ రొజెన్‌ వంటివారు తరచుగా ఈ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు.

థేమ్స్‌ పట్టణం (చైనా)



షాంగై నగర విస్తరణలో భాగంగా థేమ్స్‌ పట్టణాన్ని చైనా నిర్మించింది. 500 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో నిర్మించిన థేమ్స్‌ నగరం 2006లో పూర్తైంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జేమ్స్‌బాండ్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌ కాంస్య విగ్రహాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. విక్టోరియన్‌, జార్జియన్‌, టుడార్‌ నిర్మాణ శైలితో ఇక్కడ అనేక ఇళ్లు రూపుదిద్దుకున్నాయి. షాంగై నగరానికి 19 మైళ్ల దూరంలో ఈ పట్టణం ఉంది.



Friday, September 2, 2011

తెలుగు సినిమాకు తమిళనాడులో ఆదరణ ఎందుకు లేదు ????

తమిళ ప్రేక్షకులు పరభాషా సినిమాలను ఆదరించరని తెలుగు ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం ఉంది.కానీ ఇందులో నిజం లేదు. తమిళ సినిమాను ఏలిన అతిపెద్ద హీరోలు ఇద్దరూ తమిళులు కాదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ హీరో ఎం.జి. రామచంద్రన్ శ్రీలంకలో పుట్టిన మలయాళీ కాగా...సూపర్ స్టార్ రజనీకాంత్ కర్నాటకలో పుట్టిన మరాఠీ. తమిళ ప్రేక్షకుల మనసు దోచుకోవడం కొద్దిగా కష్టమైన పనే కానీ తెలుగు డబ్బింగ్ సినిమాలు తమిళనాడులో ఆడకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి.

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు రెండూ ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాయి. సృజనాత్మకత విషయంలో ఇటీవల కాలంలో తెలుగు సినిమా కంటే తమిళ సినిమా ముందుంటోంది. తెలుగు సినిమాలో క్రియేటివిటీ తగ్గిపోతోంది.కమర్షియల్ సినిమాలకే తెలుగు నిర్మాతలు పెద్దపీట వేస్తున్నారు.తమిళ ప్రేక్షకుల అభిరుచికి ఇవి తగ్గట్టే ఉంటాయి. చెన్నై వంటి నగరాల్లో తమిళ ప్రేక్షకులు హ్యాపీడేస్, మగధీరా, బొమ్మరిల్లు, ఆర్య వంటి సినిమాలను సబ్ టైటిళ్లతో చూస్తూ ఆనందిస్తున్నారు.

డబ్బింగ్ సినిమాలు బ్యాన్ చేయాలనే డిమాండ్ మాని..మన తెలుగు సినిమాను తమిళనాడుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ అవతల తెలుగు సినిమాకు మార్కెట్ పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. బడ్జెట్ విషయంలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో మనం పోటీపడలేకపోయినా తమిళ సినిమాకు మనం సరితూగవచ్చు. తెలుగు సినిమాకు తమిళనాడులో తగిన ఆదరణ లేకపోవడానికి ప్రధాన కారణాలను ఒకసారి చూద్దాం


డబ్బింగ్ చేయకుండా రీమేక్ రైట్స్ అమ్మడం

కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళంలో డబ్బింగ్ చేయకుండా వాటి రీమేక్ రైట్స్ విక్రయిస్తున్నారు.
ఉదాహరణకు బొమ్మరిల్లు, వర్షం, ఆర్య, తమ్ముడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, కిక్, రెడీ, పోకిరి, ఒక్కడు.
మరోవైపు సూపర్ హిట్టైన తమిళసినిమాలు మాత్రం తెలుగులోకి నేరుగా డబ్బింగ్ అవుతున్నాయి.
ఉదాహరణకు శివాజీ, రోబో, దశావతారం, బాయ్స్,సింగం, యముడు, గజనీ, పయ్యా, ఆవారా, రంగం..

తమిళంలో డబ్బింగ్ చేయడం కంటే రీమేక్ రైట్స్ అమ్మడం వలనే ఎక్కువ ఆదాయం పొందవచ్చని మన నిర్మాతలు భావిస్తున్నారు.దీనివల్ల శ్రమకూడా తక్కువే.మన తెలుగు హీరోలు కూడా తమ సినిమాలను డబ్బింగ్ చేసి తమిళనాడులో విడుదల చేయాలని కోరుకోవడం లేదు.ఆంధ్రప్రదేశ్లోనే మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది తమిళ హీరోలు తెలుగులో సూపర్ హిట్ అయిన  సినిమాలు రీమేక్ చేయడం ద్వారా ఘనవిజయాలు సాధించారన్నది వాస్తవం. తెలుగు హీరోలు తమ సినిమాలను తమిళంలో డబ్బింగ్ చేయడానికి ఇష్టపడక మంచి అవకాశాలను వదిలేస్తున్నారు.



థియేటర్ల కొరత (ప్రధాన సమస్య)

సినిమాలు తమిళనాడులో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది థియేటర్ల కొరతే. 6 కోట్లకు పైగా జనభా కలిగిన తమిళనాడులో కేవలం 925 సినిమా హాళ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో 700 థియేటర్లే యాక్టివ్ గా ఉండి కొత్త సినిమాలను విడుదల చేస్తాయి. భారీ బడ్జెట్ తమిళ సినిమాలు కూడా తమిళనాడులో థియేటర్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. తెలుగు డబ్బింగ్ సినిమాలకు, తమిళ చిన్న బడ్జెట్ సినిమాలకు థియేటర్ల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది.కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. మనరాష్ట్రంలో దాదాపు 1600 థియేటర్లు ఉన్నాయి. ఇందులో 1400 థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఓ పెద్ద తమిళ డబ్బింగ్ సినిమా ఆంధ్రప్రదేశ్లో 250 నుంచి 300 థియేటర్లలో విడుదల అవుతుంది. అంటే మధ్యస్థాయి తెలుగు సినిమాతో సమానం అన్నమాట. తమిళనాడు రాజధాని చెన్నైలో 20 థియేటర్లలో విడుదల అయ్యే భారీ బడ్జెట్ తమిళ  సినిమా హైదరాబాద్లో 50 నుంచి 60 థియేటర్లలో విడుదల అవుతుంది. 800 నుంచి 1000 సీట్ల సామర్థ్యంగల పెద్ద థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉండటం కూడా తమిళ డబ్బింగ్ సినిమాలకు అనుకూలంగా మారుతోంది. తెలుగులో డబ్బింగ్ అవుతోన్న హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు కూడా మంచిగా థియేటర్లు దొరుకుతున్నాయి. టాలీవుడ్ లో విజయాల శాతం తక్కువ కావడంతో డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపుతున్నారు.


కోట్లకు పడగలెత్తిన పబ్లిసిటీ ఖర్చు





భారీ బడ్జెట్ తెలుగు సినిమాకు పబ్లిసిటీ కోసం 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తారు. కానీ తమిళనాడులో ఆ ఖర్చు రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు ఉంటుంది. చిన్న బడ్జెట్ తమిళ సినిమాలు కూడా పబ్లిసిటీ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తాయి. తెలుగులో టీవీ, పేపర్లలో ఇచ్చే యాడ్స్ పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పరిమితి విధిస్తుంది.ఒక  ట్రయిలర్ టెలికాస్ట్ చేయడానికి ఇక్కడ దాదాపు మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ తమిళ ఛానళ్లలో 10 సెకన్ల ట్రయిలర్ కోసం దాదాపు 20 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అక్కడ టీవీ స్పాట్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారు. మ్యాగ్ జైన్, ఎఫ్.ఎం. రేడియోలు ఇతర మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో సినిమా ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సమాచార సాధనాలకు రీచ్ ఎక్కువ. తమిళ డబ్బింగ్ సినిమా 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చుచేస్తే ఇక్కడ భారీగా ప్రచారం చేసుకోవచ్చు. అదే తెలుగు డబ్బింగ్ సినిమా కోసం తమిళనాడులో ప్రచారం కోసం కోటిన్నర వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. తమిళనాడులో తెలుగుడబ్బింగ్ సినిమాకు ఇది కూడా ఓ ప్రధాన అడ్డంకి





తెలుగు డబ్బింగ్ సినిమాలపై చులకన భావం

తమిళనాడులో మాస్ ప్రేక్షకులకు తెలుగు డబ్బింగ్ సినిమాలపై కొంత వ్యతిరేక భావం ఉంది. తెలుగులో చాలా హిట్ సినిమాలు తమిళంలో రీమేక్ చేసినా వారు తెలుగు సినిమాకు ఇంకా దగ్గర అవ్వలేదు. రీమేక్ చేసిన తమిళ డైరెక్టర్, తమిళ హీరోకే క్రెడిట్ పోతోంది తప్ప అది తెలుగు వారికి దక్కడం లేదు.తెలుగులో కొన్ని బి-గ్రేడ్ సినిమాలు రీమేక్ కాకుండా తమిళంలోకి డైరెక్ట్ గా డబ్బింగ్ అవుతున్నాయి. చిన్న చిన్న డిస్టిబ్యూటర్లు వాటిని విడుదల చేస్తున్నారు.వాల్ పోస్టర్లపై పెద్దగా పరిచయం లేని ముఖాలు ఉండటం, సినిమా నిర్మాణంలో పెద్దగా నాణ్యత లేకపోవడంతో తెలుగు సినిమాలన్నీ ఇలానే ఉంటాయనే భావన తమిళ ప్రేక్షకులకు కలుగుతోంది. ఇలాంటి అభిప్రాయం నుంచి తమిళ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మహేష్ బాబు నటించిన అతడు సినిమాను నందా పేరిట డబ్బింగ్ చేయగా అది తమిళ శాటిలైట్ ఛానళ్లలో మంచి టీఆర్ పీలను సాధించింది.



15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తమిళ డబ్బింగ్ సినిమాల సందడి

దాదాపు 25 ఏళ్ల నుంచి తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి.ఐతే గత 15 ఏళ్లుగా ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. హీరోలు కమల్ హసన్, రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ సినిమాలు తమిళ,తెలుగుల్లో ఒకేసారి విడుదల అవ్వడం ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తోంది.వీరి ముగ్గురికి తెలుగు స్టార్లతో సమానమైన మార్కెట్ వేల్యూ ఆంధ్రప్రదేశ్లో ఉంది.సూర్య, విక్రమ్, కార్తీ వంటి హీరోలు ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు.గజనీ సినిమా రైట్స్ తెలుగు నిర్మాత దగ్గర ఉన్నప్పుడు దాని రీమేక్లో నటించేందుకు ఏ తెలుగు హీరో కూడా ముందుకు రాలేదు. తమిళంలో సూర్య నటించిన గజనీ తెలుగులో డబ్బింగ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో సూర్యాకు తెలుగులో మార్కెట్ వచ్చింది. అపరిచితుడు తర్వాత హీరో విక్రమ్ కూడా తెలుగులో మార్కెట్ సంపాదించుకున్నాడు. యుగానికి ఒక్కడితో కార్తీకి కూడా మంచి పేరు వచ్చింది. తెలుగు మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే వారు సినిమాలు తీస్తున్నారు. తమిళంలో సూపర్ స్టార్లుగా ఉన్న విజయ్, అజిత్ లకు ఇక్కడసరైన మార్కెట్ లేకపోవడానికి కూడా ఇదే కారణం. వీరు మొదటి నుంచి తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నం చేయలేదు. 15 ఏళ్లుగా తమిళ సినిమాలు తెలుగులో ఎక్కువగా డబ్ అవుతుండగా..తెలుగు సినిమాలు మాత్రం తమిళంలో ఆ ఒరవడి కొనసాగించలేకపోతున్నాయి.


నష్ట నివారణా చర్యలు

తెలుగు హీరోలకు తమిళంలో అప్పుడప్పుడు కొన్ని విజయాలు దక్కినా అక్కడ వారు మార్కెట్ ఏర్పాటు చేసుకోలేకపోయారు.ఇప్పుడిప్పుడే తమిళ మార్కెట్లోకి వెళ్లాలనే ఆలోచన వారికి వస్తోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి యువ కథానాయకులు తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దేశీయ బాక్సాపీస్ వద్ద తమిళ, తెలుగు సినీ పరిశ్రమలది దాదాపు ఒకే రేంజ్. తమిళనాడులో కంటే ఆంధ్రప్రదేశ్లో రెట్టింపు థియేటర్లు ఉన్నా...

ఇక్కడ జనాభా ఎక్కువైనా ఎ-1 తెలుగు స్టార్ బిజినెస్ వేల్యూ 35 నుంచి 40 కోట్ల వరకే ఉంటోంది. తెలుగు సినిమాలు దేశీయంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటకలపైనే ఎక్కువగా ఆధారపడటం ఇందుకు కారణం. అదే తమిళ స్టార్ హీరోలు తమ మార్కెట్ ను 50 కోట్ల రూపాయల వరకు విస్తరించుకున్నారు.తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో వారికి మార్కెట్ ఉండటమే అందుకు కారణం.


వినోదపు పన్ను

తెలుగు సినిమాలు తమిళనాడులో 50 శాతం వినోదపు పన్ను చెల్లిస్తున్నారనే తప్పుడు ప్రచారం ఉంది. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఆంధ్రప్రదేశ్లో వారు చెల్లిస్తున్న 15 నుంచి 20 శాతం వినోదపు పన్నునే తమిళనాడులో కూడా చెల్లిస్తున్నారు.


ఓవర్సీస్ మార్కెట్


తెలుగు సినిమాతో పోల్చుకుంటే తమిళ సినిమాకు ఓవర్ సీస్ మార్కెట్ ఎక్కువ. విదేశాల్లో తమిళులు ఎక్కువగా సెటిల్ కావడమే అందుకు కారణం. ముఖ్యంగా మలేసియా, సింగపూర్, శ్రీలంక, కెనడా, యూరోప్ లలో తమిళులు ఎక్కువగా ఉన్నారు. తెలుగుతో పోల్చుకుంటే తమిళ సినిమాలకు అక్కడ మార్కెట్ ఎక్కువ. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో మాత్రం తెలుగు, తమిళ సినిమాలు దాదాపు ఒకే మార్కెట్ కలిగి ఉన్నాయి.



కర్నాటకలో మనకే అనుకూలం

ఒక్క రజనీకాంత్ సినిమాలు మినహాయిస్తే కర్నాటక రాష్ట్రంలో తమిళ సినిమా కంటే తెలుగు సినిమాకే మార్కెట్ ఎక్కువ. ఓ స్టార్ తెలుగు హీరో ...ఓ స్టార్ తమిళ హీరో కంటే కర్నాటకలో 150 శాతం ఎక్కువగా వసూళ్లు సాధిస్తున్నాడు. చరిత్ర,భాష, ఆచారాల పరంగా కర్నాటక,ఆంధ్రప్రదేశ్ లకు దగ్గర సంబంధం ఉండటమే అందుకు కారణం.


తమిళ డైరెక్టర్ల ముందు చూపు


తమిళ హీరోలే కాదు తమిళ డైరెక్టర్లు కూడా తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు కృషి చేశారు. తెలుగులో డైరెక్టుగా కొన్ని సినిమాలు తీసి మార్కెట్ పెంచుకున్నారు. మణిరత్నం గీతాంజలి, సెల్వరాఘవన్ ఆడువారి మాటలకు, గౌతమ్ మీనన్ ఘర్షణ, ఏం మాయ చేశావే, ధరణి బంగారం, ఎస్.జె.సూర్య ఖుషి, మురుగుదాస్ స్టాలిన్ ఈ కోవలోకే వస్తాయి.శంకర్, గౌతమ్ మీనన్ వంటి డైరెక్టర్లు తెలుగులో తమకంటూ ఓ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు తెలుగు డైరెక్టర్లు మాత్రం తెలుగు సినిమాలకే పరిమితమైపోతున్నారు.తమిళ ఇండస్ట్రీలో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నించడం లేదు.శింబూ హీరోగా క్రిష్ తీసిన వనం సినిమా దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు.


కేరళ మార్కెట్


తమిళ సినిమాలు కేరళలో డబ్బింగ్ అవసరం లేకుండా డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. తమిళ హీరోలకు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడిప్పుడే తెలుగు హీరోలు కూడా కేరళలో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ కు కేరళలో మంచి మార్కెట్ ఉంది.రామ్ చరణ్ మగధీర కూడా కేరళలో బాగా ఆడింది.భవిష్యత్లో కేరళలో తమిళ హీరోలకు సరిసమానంగా తెలుగు హీరోలు కూడా మార్కెట్ పెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

మన యువ హీరోల్లో మంచి టాలెంట్ ఉంది. తమిళ యువ హీరోల కంటే మనవారు అన్ని రకాలుగా ఎంతో మెరుగ్గా ఉన్నారు.విడవని పట్టుదల, వ్యూహాత్మకత, కొంచెం అదృష్టం కలిసి వస్తే తమిళ నాడులో మన తెలుగు హీరోలు మార్కెట్ పెంచుకోవచ్చు.తమిళంలో కూడా స్టార్ లుగా మారవచ్చు

















Monday, August 29, 2011

హాకీ మాంత్రికుడు





క్రికెట్ పేరు చెప్పగానే జెంటిల్మన్ గేమ్ లో ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్ మన్ పేరు ముందుగా గుర్తుకు వస్తుంది.సాకర్ పేరు చెప్పగానే పీలే పేరు స్పురణకు వస్తుంది. మరి హాకీలో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరు...ఇంకెవరు మన భారతీయుడే...అతనే మేజర్ ధ్యాన్ చంద్.
హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దివిటీల సాయంతో సూర్యుడ్ని చూపించే ప్రయత్నమే. ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడోత్సవంగా జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది.ప్రపంచ దేశాలు హాకీలో ఓనమాలు దిద్దుకుంటున్న రోజుల్లోనే అసాధారణ ప్రతిభతో మేరుపర్వతంలా నిలిచిన ప్రజ్ఞావంతుడు ధ్యాన్ చంద్. హాకీ క్రీడకు అతను మారుపేరు. సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధీశాలి. 1928 ఆమ్‌స్టెర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టును విజేతగా నిలిపిన ఘనత నూటికి నూరుశాతం అతనిదే. ఆ ఒరవడినే భారత హాకీ జట్టు ఆతర్వాత కూడా కొనసాగించింది. 1948 లండన్, 1952 హెల్సిన్కీ, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకాలను కొల్లగొట్టింది. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో రజతంతో సరిపుచ్చుకున్నా, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి విజేతగా నిలిచింది. 1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను అందుకొని, 1980 మాస్కో ఒలింపిక్స్‌లో చివరిసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ధ్యాన్ చంద్ వేసిన బాట క్రమంగా చెదిరిపోగా, విశ్వవిజేతగా వెలుగొందిన భారత హాకీ పతనం ఆరంభమైంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సంపాదించలేని దుస్థితిని ఎదుర్కొంది. దేశంలో హాకీ ప్రాభవాన్ని కోల్పోయినా, ధ్యాన్ చంద్ మిగిల్చిన తీపి గుర్తులు ఇప్పటికీ అభిమానులకు స్ఫూర్తినిస్తున్నాయి. అతని పేరు తలచుకొని సగర్వంగా తలెత్తుకునే అదృష్టం భారతీయులకే సొంతం.
జాతీయ క్రీడగా హాకీని ఎంపిక చేయడానికి ధ్యాన్ చంద్ పరోక్షంగా కారణమయ్యాడు. ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జయంతినే భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటూ, ఇప్పటికీ అతనిని గుర్తుచేసుకోవడం మన అదృష్టం. నేటి ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905 ఆగస్టు 29న జన్మించిన ధ్యాన్ చంద్ తన కుటుంబంతోపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి, చివరికి ఝాన్సీలో స్థిర పడ్డాడు. అతని తండ్రి సమేశ్వర్ దత్ సింగ్ భారత సైన్యంలో పని చేసేవాడు. తండ్రి బదిలీ అయిన ప్రతిసారీ, కుటుంబంతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో, ధ్యాన్ చంద్ విద్యాభ్యాసం సక్రమంగా కొనసాగలేదు. కేవలం ఆరు సంవత్సరాలే అతను స్కూల్‌కు వెళ్లాడు.చిన్నతనం నుంచి రెజ్లింగ్ అంటే మక్కువ చూపిన ధ్యాన్ చంద్‌కు హాకీపై ధ్యాస ఉండేది కాదంటే ఆశ్చర్యం కలగక మానదు. తీరిక సమయాల్లో కాలక్షేపం కోసం ఝాన్సీ తరఫున హాకీ మ్యాచ్‌లు ఆడడం మినహా ఈ క్రీడను అతను ఎప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. 1922లో 16 సంవత్సరాల వయసులో ధ్యాన్ చంద్ కూడా సైన్యంలో చేరాడు. వ్యాయామ ప్రక్రియలో భాగంగా హాకీ ఆడే సమయంలో అతనిలోని నైపుణ్యాన్ని సుబేదార్ బాలే తివారీ కనిపెట్టాడు. తర్ఫీదిస్తే ఉత్తమ ఆటగాడిగా ఎదుగుతాడని అనుకున్నాడు. హాకీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. అతని అంచనా నిజమైంది. ధ్యాన్ చంద్ హాకీ స్టిక్‌తో అద్భుతాలు సృష్టించడం ఆరంభమైంది.
1922-1926 మధ్యకాలంలో అసాధారణ ప్రతిభ కనబరచి, భారత ఆర్మీ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లిన ఆ జట్టు 21 మ్యాచ్‌లు ఆడి, 18 విజయాలతో అదరగొట్టింది. రెండు మ్యాచ్‌లు డ్రాకాగా, ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది. ఆ వెనువెంటనే న్యూజిలాండ్ జాతీయ జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొని ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. మరో మ్యాచ్‌ని కోల్పోయింది. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ధ్యాన్ చంద్‌కు లాన్స్ నాయక్ హోదా లభించింది.
న్యూజిలాండ్ పర్యటన తర్వాత ధ్యాన్ చంద్‌కు వెనదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 1925లో భారత హాకీ సమాఖ్య ఏర్పాటైంది. యునైటెడ్ ప్రావీన్స్ (యుపి) తరఫున ధ్యాన్ చంద్ తొలి సివిలియన్ మ్యాచ్‌లు ఆడాడు. సెలక్టర్లను ఆకర్షించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1928లో భారత హాకీ జట్టు తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6-0 తేడాతో గెలిచింది. ధ్యాన్‌చంద్ మూడు గోల్స్ సాధించాడు. ఆతర్వాత బెల్జియంపై ఒకటి, డెన్మార్క్‌పై మూడు, సెమీ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌పై నాలుగు చొప్పున గోల్స్ సాధించి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 3-0 తేడాతో గెలుపొందింది. ధ్యాన్‌చంద్ రెండు గోల్స్‌తో రాణించాడు. భారత్‌కు తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించాడు.
1932 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో భారత జట్టు 24-1 తేడాతో అమెరికాను చిత్తుచేసి సంచలనం సృష్టించింది. ధ్యాన్ చంద్ ఎనిమిది, అతని సోదరుడు రూప్ సింగ్ 10, గుర్మీత్ సింగ్ ఐదు గోల్స్ చేయగా, పినిగర్ ఖాతాలోకి ఓగోల్ చేరిం ది. అంతకు ముందు జపాన్‌ను 11-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఒలింపిక్స్‌కు ఆరంభానికి ముందు, ముగిసిన తర్వాత భారత జట్టు శ్రీలంక, అమెరికా తదితర దేశాల్లో పర్యటించింది. మొత్తం 37 మ్యాచ్‌లు ఆడింది. 34 విజయాలు సాధించింది. రెండు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ రద్దయింది. మొతతం 338 గోల్స్ సాధించింది. వీటిలో ధ్యాన్ చంద్ ఒక్కడే 133 గోల్స్ సాధించాడు. భారత జట్టులో అతను ఎంతటి కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ధ్యాన్ చంద్ ప్రాతినిథ్యం వహించిన ఝాన్సీ హీరోస్ జట్టు 1933లో బీటన్ కప్‌ను కైవసం చేసుకుంది. 1935లో లక్ష్మీబిలాస్ కప్‌ను గెల్చుకోవడంతోపాటు బీటన్ ట్రోఫీని నిలబెట్టుకుంది. 1934లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. మానవదార్ నవాబు ఈ టూర్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో ధ్యాన్ చంద్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. న్యూజిలాండ్‌లో 28 మ్యాచ్‌లు ఆడిన భారత్, ఆతర్వాత స్వదేశంలోనేగాక, సిలోన్ (ఇప్పటి శ్రీలంక), ఆస్ట్రేలియా దేశాల్లో మరో 20 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 48 మ్యాచ్‌లలో భారత జట్టు 584 గోల్స్ సాధించింది. వాటిలో ధ్యాన్ చంద్ 201 గోల్స్ నమోదు చేశాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో హంగరీని 4-0, అమెరికాను 7-0, జపాన్‌ను 9-0 తేడాతో ఓడించిన భారత్, సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై 10-0 తేడాతో విజయభేరి మోగించింది. మరోవైపు జర్మనీ లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకొని ఫైనల్ చేరింది. ఆగస్టు 15న జరిగిన ఫైనల్‌లో భారత్ 8-1 తేడాతో జర్మనీని చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ధ్యాన్ చంద్ మూడు గోల్స్ చేశాడు. అలీ దారా రెండు, రూప్ సింగ్ తాప్సెల్, జాఫర్ తలా ఒక గోల్‌తో రాణించారు. మొత్తం మీద మూడు ఒలింపిక్స్‌లో ధ్యాన్ చంద్ 12 మ్యాచ్‌లు ఆడి, 33 గోల్స్ నమోదు చేశాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో జాతీయ జట్టు నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ధ్యాన్ చంద్, 1956లో సైన్యం నుంచి పదవీ విరమణ పొందాడు.
1979 డిసెంబర్ 3న మృతి చెందిన ధ్యాన్ చంద్ భౌతిక కాయాన్ని ఝాన్సీ పట్టణంలోనే సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. 1956లో ధ్యాన్ చంద్‌ను పద్మ విభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటి వరకూ హాకీలో ఈ అవార్డును అందుకున్న ఏకైక క్రీడాకారుడిగా ధ్యాన్ చంద్ పేరు రికార్డు పుస్తకాల్లో నిలిచిపోయింది. భారత హాకీకి, తద్వారా క్రీడా రంగానికి ధ్యాన్ చంద్ జయంతి రోజున అట్టహాసంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ధ్యాన్ చంద్ లేని భారత హాకీనిగానీ ఊహించడం కష్టం.
ధ్యాన్ చంద్ జీవితంలో ఆసక్తికర విషయాలు


* భారత జట్టు 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటి మ్యాచ్ ఆడిన వెంటనే ధ్యాన్ చంద్ ప్రతిభ అందరికీ తెలిసొచ్చింది. తర్వాతి మ్యాచ్ ఆరంభానికి ముందు జర్మనీ పత్రికలన్నీ ధ్యాన్ చంద్ ఆటనే ప్రత్యేకంగా ప్రస్తావించాయి. దీనితో భారత్ ఆడిన రెండో మ్యాచ్‌కి ప్రేక్షకులు ఎగబడ్డారు. వారి అంచనాలు తారుమారుకాలేదు. ధ్యాన్ చంద్ ‘మ్యాజిక్ స్టిక్’ విన్యాసాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి.
* ధ్యాన్ చంద్ అసాధారణ ప్రతిభ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయ. వాటిలో ఇదీ ఒకటి. ఒకసారి ప్రేక్షకుల నుంచి ఓ మహిళ హఠాత్తుగా మైదానంలోకి వచ్చి, ధ్యాన్ చంద్ కు తాను వాడే చేతి కర్ర అందించిందట. అతను వాడే స్టిక్‌లో ఎలాంటి మోసం లేదని నిరూపించుకోవాలంటే, చేతి కర్రతోనే ఆడి, గోల్స్ చేయాలని కోరిందట. హాకీ హీరో ధ్యాన్ చంద్‌కు అదో సమస్యగా తోచనే లేదట. ఆనందంతో ఆమె చేతి నుంచి కర్రను తీసుకొని ఆటను కొనసాగించాడట. అంతేకాదు.. అదే కర్రతో గోల్స్ చేసి ఔరా అనిపించుకున్నాడట.

* ధ్యాన్ చంద్ ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా గోల్ చేయలేకపోయాడు. గోల్స్ నమోదు కాకపోవడానికి గోల్‌పోస్టులో తేడా ఉండడమే కారణమని గ్రహించాడు. ఇదే విషయాన్ని రిఫరీ దృష్టికి తీసుకెళ్లాడు. గోల్ పోస్టును కొలిచి చూస్తే, ధ్యాన్ చంద్ అనుమానమే నిజమైంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టు గోల్ పోస్టు లేదని తేలింది. ఆటపై అతనికి ఉన్న పట్టుకు ఇదో ఉదాహరణ.
* ఆస్ట్రేలియా క్రికెట్ లెజెంట్ సర్ డొనాల్డ్ ఒకసారి ధ్యాన్ చంద్ ఆటను స్వయంగా చూశాడు. 1935లో భారత జట్టు ఆసీ స్ టూర్‌కు వెళ్లినప్పుడు అడెలైడ్‌లో ధ్యాన్ చంద్ మ్యాచ్ ఆడాడు. అతని ఆటను ఎంతో ఆసక్తిగా చూసిన బ్రాడ్‌మన్ అతనిని పొగడ్తల్లో ముంచెత్తాడు. క్రికెటర్లు పరుగులు సాధించినంత సులభంగా అతను గోల్స్ చేస్తున్నాడని ప్రశంసించాడు.
* ధ్యాన్ చంద్ ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతని హాకీ స్టిక్‌లో అయస్కాంతం ఉందేమోనని హాలెండ్ అధికారులకు అనుమానం వచ్చింది. అనుకున్నదే తడవుగా ధ్యాన్ చంద్ హాకీ స్టిక్‌ను తీసుకొని, విరగ్గొట్టి మరీ పరీక్షించారు. అయస్కాంతం లేదని తెలుసుకొని నాలిక కరచుకున్నారు

* 1932 ఒలింపిక్స్‌లో అమెరికాను భారత జట్టు 24-1 తేడాతో చిత్తుచేసింది. ధ్యాన్‌చంద్ సోదరుడు రూప్ సింగ్ ఈ మ్యాచ్‌లో పది గోల్స్ చేశాడు. ఒలింపిక్స్ హాకీ టైటిల్ పోరులో ఇంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా భారత్, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రూప్ సింగ్ నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదర లేదు. ఆ మ్యాచ్‌లో అమెరికా ఒకే ఒక గోల్ చేసింది. మ్యాచ్ ముగింపు దశకు చేరిందన్న ధీమాతో భారత గోల్ కీపర్ రిచర్డ్ జేమ్స్ అలెన్ అభిమానులకు ఆటో గ్రాఫ్‌లు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు. అదే అవకాశంగా అమెరికా ఒక గోల్ చేసింది.
* మొక్కవోని ఆత్మవిశ్వాసానికి, తిరుగులేని దేశ భక్తికి మారుపేరు ధ్యాన్ చంద్. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి నాయకత్వం వహించిన అతను జర్మనీ నియంత అలాల్ఫ్ హిట్లర్‌కు వందనం చేయలేదు. లేత నీలం రంగు తలపాగా ధరించి, బంగారు రంగు దుస్తులతో వెలిగిపోయిన భారత బృందాన్ని ‘పెళ్లి బృందం’ అంటూ జర్మనీ మీడియా హేళన చేసింది. కానీ, ఈ బృందమే జర్మనీకి చెంపపెట్టు సమాధానం చెప్పింది.
క్రీడాకారులకు కూడా భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే...దేశ అత్యున్నత అవార్డ్ కు అన్ని విధాల అర్హత గల మొదటి క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్





Saturday, February 5, 2011

స్పోర్ట్స్ స్టార్స్, బాలీవుడ్ భామల మ్యాచ్ ఫిక్సింగ్

స్పోర్ట్స్, సినిమా ఈ రెండు రంగాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి. వీటి మధ్య  అవినాభావ సంబంధం ఉంది. ఎంతవారైనా కాంతదాసులే అన్నట్లు..ప్రఖ్యాత స్పోర్ట్స్ స్టార్స్ అంతా బాలీవుడ్ భామలకు దాసోహమైనవారే. ఈ విషయంలో క్రికెటర్లు మిగతా క్రీడాకారుల కంటే ముందుంటారు.

భారతదేశంలో క్రికెట్ ఒక మతం, సినీ హీరోల కంటే స్టార్ క్రికెటర్లకు ఎక్కువగా క్రేజ్ ఉంది. అందుకే బాలీవుడ్ భామలు క్రికెటర్లను కొంగునముడేసుకోవాలని చూస్తారు. క్రికెటర్లతో బాలీవుడ్ హీరోయిన్లకు ఉన్న లింకులు ఈనాటివి కావు. ఈ లవ్ గేమ్ ఎప్పుడో ప్రారంభమైంది. నేటికీ కొనసాగుతోంది. చాలా ప్రేమకథలు మధ్యలోనే ముగిస్తే కొన్ని మాత్రం పెళ్లి వరకు చేరుకున్నాయి.

భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ (నవాబ్ పటౌడీ) అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ తో రొమాన్స్ నడిపాడు. ఆ తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ జీనత్ అమన్ తో కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. వెస్టిండీస్ దిగ్గజం గారీ సోబర్స్..బాలీవుడ్ సుందరి అంజూ మహెన్ ద్రూతో ప్రణయం కొనసాగించాడు. ఐతే వీరి బంధాలు మున్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.




బాలీవుడ్ నటి అమృతా సింగ్ తో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి కొన్నేళ్లు రొమాన్స్ చేసినట్లు రూమర్లు షికారు చేశాయి. 1983లో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న తరుణంలో రీనారాయ్ ...పాకిస్థాన్ క్రికెటర్ మోహిసిన్ ఖాన్ ను మనువాడింది. సినిమాలకు గుడ్ బై చెప్పి పాక్ వెళ్లిపోయింది. వీరి పెళ్లి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. విడాకులు తీసుకుని తన కూతురితో సహా రీనారాయ్ మళ్లీ ఇండియా వచ్చేసింది.

వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్ మన్ వీవీయన్ రిచర్డ్స్...బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాతో సహజీవనం చేశాడు. వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. రిచర్డ్స్ ఆ తర్వాత నీనా గుప్తాను వదిలేశాడు.

పెళ్లయిన కొందరు ఆటగాళ్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చి బాలీవుడ్ భామలను మనువాడారు. మనోజ్ ప్రభాకర్, అజహరుద్దీన్, మహేశ్ భూపతి ఈ కోవలోకే వస్తారు. భారత మాజీ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్ తన మొదటి భార్య సంధ్యాకు విడాకులిచ్చి ఫరీన్ ను పెళ్లాడాడు. మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్  కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి..సల్మాన్ ఖాన్ తో బంధాన్ని తెంచుకున్న సంగీతా బిజిలానీని ఏరికోరి మనువాడాడు.

బెంగాలీ దాదా సౌరవ్ గంగూలీ కొన్నాళ్ల పాటు బాలీవుడ్, టాలీవుడ్ నటి నగ్మాతో మస్త్ మస్త్ రొమాన్స్ సాగించాడు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ దేవాలయంలో జంటగా దర్శనమిచ్చారు. చివరికి నగ్మాతో ప్రేమాయణానికి చరమగీతంపాడిన గంగూలీ తిరిగి తన భార్య డోనా చెంతకు చేరాడు.


క్రికెటర్లే కాదు బాలీవుడ్ భామలతో లింకుల విషయంలో టెన్నిస్ స్టార్లు కూడా తక్కువేమీ తినలేదు. భారత టెన్నిస్ వీరుడు లియాండర్ పేస్, సినీ స్టార్ మహిమా చౌదరితో లాంగ్ రిలేషన్షిప్ కొనసాగించాడు. ఆ తర్వాత పేస్..రియా పిళ్లైని వివాహం చేసుకోవడంతో వీరి మధ్య బంధం ముగిసింది. మరో టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి కూడా ఈ విషయంలో చాలా ముదురే. మొదటి భార్యకు విడాకులిచ్చిన భూపతి..మాజీ విశ్వసుందరి లారా దత్తాతో ఒకటయ్యాడు. టెన్నిస్ బ్యూటీ సానియామీర్జా, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మధ్య బంధంపై రూమర్లు షికారు చేశాయి. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వీరిద్దరూ ఆ పుకార్లను ఖండించారు. సానియాను పెళ్లాడిన షోయబ్ మాలిక్ కూడా  బాలీవుడ్ భామ సయ్యాలి భగవత్ తో కొంతకాలం రొమాన్స్ కొనసాగించడం విశేషం.



బాలీవుడ్ హాట్ గాళ్ బిపాసా బసూ, ఒక మెగా ఈవెంట్ సందర్భంగా పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి ఇచ్చిన లిప్ కిస్ అప్పట్లో పెను దుమారమే లేపింది. ఐతే వీరి రిలేషన్ వెంటనే ముగిసిపోయింది. ఇంగ్లిష్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్ తో అమృతా అరోరా కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో చిలకకొట్టుడు హీరోలకు తక్కువేమీ లేదు. టీమిండియా లవర్ బాయ్ గా పేరుగాంచిన యువరాజ్ సింగ్ ఈ విషయంలో అందరికంటే ముందుంటాడు. బాలీవుడ్ భామ కిమ్ శర్మతో యువీ కొన్నేళ్లు ప్రేమాట ఆడాడు. ఐతే ఇది పెళ్లి వరకు చేరలేదు. ఆ తర్వాత దీపికా పదుకునే, యువరాజ్ సింగ్, మహేంద్రసింగ్ ధోనీ మధ్య ట్రయాంగులర్ లవ్ స్టోరీ నడిచింది. ధోనీ సైడైపోయినా యువీకి దీపికా హ్యాండ్ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కో-ఓనర్ ప్రీతి జింతాకు యువీ దగ్గరయ్యాడు. అప్పట్లో ప్రియుడు నెస్ వాడియాతో ప్రీతికి వచ్చిన విభేదాలకు ఇదే కారణమైంది. ఆ తర్వాత ప్రీతి...యువీకి దూరమైంది.



భారత పేసర్ జహీర్ ఖాన్ ...గ్లామర్ బ్యూటీ ఇషా శర్వాణీ అందానికి బౌల్డ్ అయ్యాడు. వివాదాల పేసర్ శ్రీశాంత్ ఐతే గ్లామర్ గాళ్స్ సోనాలీ నాగ్రాణి, సుర్విన్ చావ్లా, డైసే బొనప్పలతో ప్రణయం సాగించాడు. పెళ్లికి ముందు భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దక్షిణాది హీరోయిన లక్ష్మీ రాయ్ తో చాటుమాటు వ్యవహారాలు సాగించాడు.
స్పోర్ట్స్ ఐకాన్స్, బాలీవుడ్ బ్యూటీస్ మధ్య ఎప్పుడో ప్రారంభమైన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. విజేతలు ఎవరైనా ఈ లవ్ గేమ్ లో పరాజితులు మాత్రం లేకపోవడం విశేషం.

Tuesday, January 25, 2011

నూరేళ్ల జనగణమన (మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాకి వందేళ్లు)

జాతీయ గీతం (రవీంద్రనాథ్ ఠాగూర్)

జనగణమన అధినాయక జయహే!
                        భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా!
                           ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ!
                            ఉచ్చల జలధితరంగ!
తవశుభనామే జాగే! తవ శుభ ఆశిష మాగే!
                              గాహే తవ జయగాథా!
జనగణమంగళ దాయక జయహే!
                              భారత భాగ్య విధాతా!
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!

ప్రజలందరి మనస్సుకూ అధినేతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక. పంజాబ, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోను, వింధ్య, హిమాలయ పర్వతాలతోను, యమునా, గంగా ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను శోభించే ఓ భాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులను ఆకాంక్షిస్తాయి. నీ జయ గాథల్ని గానం చేస్తాయి. సకల జనులకు మంగళకారివి. భారత భాగ్య విధాతవూ అయిన నీకు జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!


విశ్వకవి రవీంద్రుని కలం నుంచి జాలు వారిన గీతం 'జనగణమన'. యావత్ భారతావనిని ఏకతాటిపై నిలిపిన స్ఫూర్తి గీతిక ఇది. మన జాతీయ గీతానికి నూరేళ్లు. రవీంద్రుడు దేశానికి ఇచ్చిన కానుక ఇది. భరతమాత కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటే గేయం ఇది. భారత దేశ భౌగోళిక స్వరూపం కళ్లకు కట్టే అక్షర చిత్రం. జనగణమన పూర్తి గేయం 5 చరణాలు కాగా మనం మొదటి చరణం మాత్రమే ఆలపిస్తాం.


జనగణమన చరిత్ర

దీనిని తొలిసారిగా 1911 డిసెంబరు 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలో ఆలపించారు.

ఈ గీతానికి జాతీయ హోదాను కల్పిస్తూ 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన రాజ్యాంగ అసెంబ్లీ తీర్మానించింది.

భారతదేశ సమున్నతిని చాటిచెబుతూ, ప్రతి భారతీయుని మదిలో జాతీయ భావాన్ని పురికొల్పే రీతిలో సాగిన రవీంద్రుని 'జనగణమన' నేటికి దేశభక్తిని ప్రభోది స్తున్నది. జనగణమనను బాణీ కనుగుణంగా  గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది. రవీంద్రుడు ఈ గీతాన్ని రాసిన తొలినాళ్ళలో కేవలం కొంతమందికి మాత్రమే పరిచయంలో ఉండేది. అదీ కూడా రవీంద్రుని సంపాదకత్వంలో బ్రహ్మ సమాజం తరుపున వెలువడే 'తత్త్వ బోధ ప్రకాశిక' అనే పత్రిక పాఠకులకు మాత్రమే దీనితో అనుబంధం ఏర్పడింది.
 జనగణమనకు ఆంధ్రాతో అనుబంధం
ఇప్పుడు అందరి నోటా రాగయుక్తంగా ఆలపించబడుతున్న 'జనగణమన'ను ఆంగ్లంలో అనువదించడమూ, దానిని స్వర పరచడం రెండూ మన ఆంధ్రరాష్ట్రంలోనే జరగడం ఎంతో గర్వకారణం. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలలో ఈ ప్రక్రియ సాగింది. 1919లో బెంగుళూరు వచ్చిన రవీంద్రుడు అదే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మదనపల్లెలోని బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలను సందర్శిం చాడు. ఆ కళాశాల నెలకొన్న వాతావరణం, ప్రకృతి శోభకు రవీంద్రుడు ఎంతగానో పులకించి పోయాడు. అదే సమయంలో అక్కడి విద్యార్ధులకు తాను రచించిన 'జనగణమన' గీతాన్ని నేర్పాడు. కళాశాల ప్రిన్సిపల్ జేమ్స్‌ కజిన్స్‌ కోరికపై జనగణమన గీతాన్ని 'మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా' అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ తర్జుమా ఒరిజినల్ ప్రతి ఇప్పటికీ మదనపల్లెలో బీసెంట్ దివ్యజ్ఞాన సమాజ కాలేజ్ లో భద్రంగా ఉంది. జేమ్స్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్  యూరోపియన్‌ సంగీత విద్వాంసురాలు, ఆమెతో కలిసి రవీంద్రుడు ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆ తరువాత కాలంలో 'జనగణమన' గీతం భారతీయ భాషలు అన్నిటిలోకి అనువదించబడింది.

వివాదాల సుడి
భరత జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఈ గీతం చుట్టూ కొన్ని వివాదాలూ ఉన్నాయి. 1911లో కింగ్ జార్జి-5 పట్టాభిషేక తరుణంలో తెరపైకి వచ్చిన ఈ గీతం ఆయనను కీర్తించేందుకు ఉద్దేశించినదేనన్నది ప్రధాన విమర్శ. 

ఆనాటి జార్జి చక్రవర్తి జార్జ్‌ భారత్‌ పర్యటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను కీర్తిస్తూ ఈ గేయాన్ని రచించారన్నది కొన్ని పత్రికలు విమర్శలు చేశాయి.గీతంలోని 'భారత భాగ్య విధాత.. అధినాయక' అనే పదాలు భగవంతుణ్ని ఉద్దేశించినవి కాదని, అవి కేవలం కింగ్ జార్జి-5ను కీర్తిస్తూ రాసినవన్న విమర్శలున్నాయి. తొలిసారి ఈ గీతాలాపన జరిగిన మర్నాడు పలు బ్రిటన్ పత్రికల్లో సైతం ఈ గీతం ఉద్దేశం అదేనంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను తర్వాత ఠాగూర్ నిర్ద్వంద్వంగా ఖండించారు. రవీంద్రుడు తన మిత్రునికి లేఖ రాస్తూ తన గేయంపై వచ్చిన విమర్శనాత్మక ప్రచారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు. తాను ఈ గేయంలో కేవలం జయాన్ని, భగవంతుని మాత్రమే కీర్తించానని తెలిపాడు. ఏ రాజుల కోసం, ఏ చక్రవర్తుల కోసమో, మరే పాలకుల కోసమో దీనిని తాను రచించలేదని కేవలం భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకునే రాశానని తన లేఖలో నిర్ద్వందంగా ఖండించాడు.
అలాగే ఈ గీతంలో పంజాబ, సింధు, గుజరాత, మరాఠ.. అంటూ సాగే రాష్ట్రాల పేర్లపైనా వివాదం ఉంది. అలనాటి సంస్థానాల ప్రస్తావనే అందులో లేదన్నది ప్రధాన అభ్యంతరం. విభజన అనంతరం పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిన సింధును తొలగించి, మన కాశ్మీర్‌ను గీతంలో చేర్చాలన్న డిమాండ్ ఉంది. అన్నిటినీ మించి స్వాతంత్య్ర సమరంలో ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన 'వందేమాతరా'న్ని కాదని 'జన గణ మన'ను జాతీయ గీతంగా ఆమోదించడం పట్ల కూడా పలు అభ్యంతరాలున్నాయి!!


జనగణమన గీతం విశ్వకవి ఆత్మనే కాదు యావత్‌ భారతదేశాత్మను కూడా నినదింపజేస్తోంది. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో గుర్తించింది. అతి విలువైన, అమూల్యమైన అవార్డు మన గీతానికి దక్కడం భారతీయులుగా మనకందరికీ గర్వకారణం. ఆ బాలగోపాలానికి ప్రీతిపాత్రమైన ఈ గీతాన్ని కలకాలం నిలుపు కుందాం. దేశం దశ దిశలా మారుమోగే ఈ సుందర గీతాన్ని గుండెగుండెలో నింపుకుందాం.జైహింద్.
 

Friday, January 21, 2011

మాచుపిచు (Wonder Of The World)






ఆకాశాన్నంటే శిఖరం...ఆపై భాగంలో అద్భుత నగరం. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తున అబ్బురపరిచే అపురూపమైన కట్టడాలు. మేఘాలు చేతికందే చోట ఔరా అనిపించే కోట. చుట్టూరా సహజసిద్ధంగా కొండలు, లోయలు. దిగువన ప్రవహించే సెలయేళ్లు, నదులు. పర్వతాగ్రాన అడుగడుగునా పనితనం ప్రతిబింబించే నిర్మాణాలు. గోడగోడల్లో పేర్చిన ప్రతిరాయలోనూ ఉట్టిపడే నైపుణ్యం. అదే పర్యాటకుల మనసు దోచే మాచుపిచు. పెరూ దేశంలోని శిథిల నగరం.

మాచుపిచు...అంటే పురాతన శిఖరం అని అర్థం. సముద్రమట్టానికి 2,430 మీటర్లు అంటే దాదాపు 80 వేల అడుగుల ఎత్తున ఉరుబంబా లోయల్లోని పర్వతాగ్రం ఇది. దక్షిణ అమెరికాలోని పెరుదేశంలో కుజ్ కో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఉంది.ఓ వైపు లోయ మరోవైపు పరవళ్లు తొక్కే ఉరుబంబా నదీ ప్రవాహం.
ఆ మధ్యలో ఎత్తైన పర్వతం మధ్య మాచుపిచు నగరం.15వ శతాబ్దంలో పెరూను పాలించిన ఇన్ కా సామ్రాజ్యపు నగరమే మాచుపిచు. క్రీ.శ. 1450 ప్రాంతంలో ఈ నగరాన్ని నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. వందేళ్ల తర్వాత 1572లో ఇన్ కా సామ్రాజ్యంపై స్పానిష్ దురాక్రమణలో ఇది నాశనమైంది.

ఈ శిథిల నగరాన్ని కనుగొన్నది అమెరికా చరిత్రకారుడు హిరామ్ బింఘమ్. కుజ్ కో నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశోధన జరుపుతున్న ఆర్కియాలజీ బృందాలకు మాచుపిచు నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించాయి.ఎన్నో వ్యయప్రయాసలకు గురైన పురాతత్వ బృందాలు ఉరుబంబా నది పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో ఏళ్లపాటు పరిశోధనలు సాగించారు. మాచుపిచు శిఖరం చేరుకోవడానికి వందల ఏళ్ల క్రితం నిర్మించిన దారులను కష్టంమీద కనుగొన్నారు. చివరికి వాళ్ల శ్రమ ఫలించింది. 1911లో హిరామ్ నేతృత్వంలోని పురాతత్వ బృందం అక్కడి అద్భత నిర్మాణాలను వెలికితీయగలిగింది. ఇన్కా సామ్రాజ్య వైభవాన్ని చాటే నిర్మాణాలతో పాటు దేవాలయాలు, నీటి వనరుల సద్వినియోగానికి ఇన్ కా రాజులు నిర్మించిన కట్టడాలు, సమాధులు..ఇలా ఒక్కో కట్టడం వెనక ఆసక్తికర విశేషాలు.

సంపూర్ణంగా ప్రశాంతత నిచ్చే నగరంగా మాచుపిచును టూరిస్టులు భావిస్తారు. సూర్య భగవానుని కోసంకట్టిన సన్ టెంపుల్ ఇక్కడ మెయిన్ ఎట్రాక్షన్. ఇక్కడి కట్టడాలను దేవతలు కట్టారని నమ్మేవారు కూడా ఎక్కువే.ఇక్కడి కట్టడాలు రహస్యాల మయం. నిటారుగా ఆకాశంలోకి దూసుకెళ్లిన పర్వత శిఖర భాగంలో పిరమిడ్ ఆకారంలో నిర్మించిన గుడి అందుకు నిదర్శనం. ఈ కట్టడం కోసం ఉపయోగించిన రాళ్లు టన్నుల కొద్ది బరువు ఉండటం ఒక వింతైతే వాటిని కచ్చితమైన కొలతలు, కోణాలతో సహా చెక్కి యుగాల తరబడి చెక్కు చెదరని రీతిలో పేర్చడం మరో ఎత్తు. అంతబరువైన రాళ్లను ఇంత ఎత్తుకు ఎలా చేర్చారు? అంత అద్భుతంగా ఎలా తీర్చిదిద్దగలిగారు? పక్కనే లోయల్లో ఉరుబంబా నదీ ప్రవాహం ఒడ్డున హాయిగా నివశించకుండా ఇంత ఎత్తులో నిర్మించాల్సిన అవసరం ఏంటి?
ఇలా మాచుపిచు అణువణువు రహస్యాల మయమే.

14,15 శతాబ్దాల్లో కుజ్కు రాజధానిగా ఉన్న పెరూ దేశాన్ని ఇన్కా రాజులు పాలించిన సమయంలో మాచుపిచు కేంద్రంగా వ్యవసాయ పరిశోధనలు జరిగి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రకృతి సిద్ధంగా నీటిని నిల్వ చేసే వ్యవస్థలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. మాచుపిచు పరిసర ప్రాంతాల తవ్వకాల్లో బయటపడ్డ మృణ్మయ పాత్రల నాణ్యత, వివిధ ఆకృతుల్లో వాటిని తయారు చేసిన పద్ధతులు నాటి ఇన్కా సామ్రాజ్యపు వైభోగాన్ని కళ్లకు కడతాయి.

మాచుపిచు నాగరికత ఎలా అంతరించింది
విషాదమేమిటంటే 15వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగిన ఇన్కా సామ్రాజ్యం స్పానిష్ దురాక్రమణలో ఉనికిని కోల్పోయింది. మాచుపిచు ఒక్కటే ఈ దాడులకు గురికాలేదని చరిత్రకారుల నమ్మకం. కానీ మశూచీ, పొంగు, విషజ్వరాలు వంటి జబ్బులకు తగిన మందులు లేక నాటి జనాభాలో 90 శాతం తుడిచిపెట్టుకుపోయింది.
1911లో చరిత్రకారుడు హీరామ్ బింఘామ్ ఈ ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత పెరూ దేశం మాచుపిచును తమ వారసత్వ సంపదగా ప్రకటించుకుంది. 1971లో మాచుపిచు చుట్టుపక్కల 325 చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్నంతా చారిత్రక, పవిత్రమైన ప్రదేశంగా పెరూ చట్టం చేసింది. 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దక్కించుకున్న మాచుపిచు 2007లో ప్రపంచంలోని ఏడు వింత జాబితాలో చేరింది.

పర్యాటక కేంద్రం
హేతువాదులు, ఆధ్యాత్మకవాదులు,శాస్త్రవేత్తలు...ఈ మూడు వర్గాలకు కామన్ గా నచ్చే ప్రదేశాలు కొన్నే ఉంటాయి. అందులో మాచుపిచు ఒక్కటి. ఏటా కనీసం 8 లక్షల మంది టూరిస్టులు మాచుపిచును సందర్శిస్తుంటారు. వీరిలో విదేశీయుల సంఖ్య 5 లక్షలుగా ఉంటుంది. 90వ దశకంలో మాచుపిచు చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజుకు వంద మాత్రమే అది ఇప్పుడు 2 వేలకు చేరింది. కుజ్కో నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు అనేకం విలాసవంతమైన హోటళ్లుగా అభివృద్ధి చెందటంతో మాచుపిచు...పెరూ టూరిజం ప్రధాన వనరుగా మారింది.
రజనీ కాంత్ రోబో సినిమాలోని కిలిమంజారో అనే పాటను ఇక్కడే చిత్రీకరించారు. మాచుపిచులో మహా నిర్మాణాలు ఎలా సాధ్యమనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.



Friday, January 14, 2011

భూమ్మీదే కైలాసం

సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో.

మంచు కొండల్లో వెండివెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతుపట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని
అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం
ఈ భూమ్మీదే ఉంది.

సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి ( గంగానదికి ఉపనది)మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు అర్థంకాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడోవైపు ఏనుగుగా, నాలుగోవైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంకాగా, సింహం పార్వతి దేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమార స్వామి వాహనం.ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి.
మంచుపూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం.

కైలాస పర్వతాన్ని అపశవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంత మంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు మూడురోజుల సమయం పడుతుంది.

కైలాసాన్ని ఎవరూ అధిరోహించలేదా 
ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యంకాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలుపెట్టడం మహాపాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించాలని చెబుతారు. 1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది. రెండుసార్లు ఈ పర్వతం పైకి హెలికాఫ్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహనం చేయడం లేదు.ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటివరకు అవుటర్ సర్కిల్ లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్ లోకి వెళ్లిన వారు లేరు. ఈ పర్వత ఉపరి భాగంలో  ఏముందో సైన్స్ కు కూడా అంతుబట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ ను షహస్ర చక్రంగా పేర్కొన్నారు.
కైలాస పర్వత యాత్ర
భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.
మానస సరోవరం
కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు  కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. హర హర మహాదేవ శంభో శంకర.