Tuesday, January 25, 2011

నూరేళ్ల జనగణమన (మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాకి వందేళ్లు)

జాతీయ గీతం (రవీంద్రనాథ్ ఠాగూర్)

జనగణమన అధినాయక జయహే!
                        భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా!
                           ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ!
                            ఉచ్చల జలధితరంగ!
తవశుభనామే జాగే! తవ శుభ ఆశిష మాగే!
                              గాహే తవ జయగాథా!
జనగణమంగళ దాయక జయహే!
                              భారత భాగ్య విధాతా!
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!

ప్రజలందరి మనస్సుకూ అధినేతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక. పంజాబ, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోను, వింధ్య, హిమాలయ పర్వతాలతోను, యమునా, గంగా ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను శోభించే ఓ భాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులను ఆకాంక్షిస్తాయి. నీ జయ గాథల్ని గానం చేస్తాయి. సకల జనులకు మంగళకారివి. భారత భాగ్య విధాతవూ అయిన నీకు జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!


విశ్వకవి రవీంద్రుని కలం నుంచి జాలు వారిన గీతం 'జనగణమన'. యావత్ భారతావనిని ఏకతాటిపై నిలిపిన స్ఫూర్తి గీతిక ఇది. మన జాతీయ గీతానికి నూరేళ్లు. రవీంద్రుడు దేశానికి ఇచ్చిన కానుక ఇది. భరతమాత కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటే గేయం ఇది. భారత దేశ భౌగోళిక స్వరూపం కళ్లకు కట్టే అక్షర చిత్రం. జనగణమన పూర్తి గేయం 5 చరణాలు కాగా మనం మొదటి చరణం మాత్రమే ఆలపిస్తాం.


జనగణమన చరిత్ర

దీనిని తొలిసారిగా 1911 డిసెంబరు 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలో ఆలపించారు.

ఈ గీతానికి జాతీయ హోదాను కల్పిస్తూ 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన రాజ్యాంగ అసెంబ్లీ తీర్మానించింది.

భారతదేశ సమున్నతిని చాటిచెబుతూ, ప్రతి భారతీయుని మదిలో జాతీయ భావాన్ని పురికొల్పే రీతిలో సాగిన రవీంద్రుని 'జనగణమన' నేటికి దేశభక్తిని ప్రభోది స్తున్నది. జనగణమనను బాణీ కనుగుణంగా  గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది. రవీంద్రుడు ఈ గీతాన్ని రాసిన తొలినాళ్ళలో కేవలం కొంతమందికి మాత్రమే పరిచయంలో ఉండేది. అదీ కూడా రవీంద్రుని సంపాదకత్వంలో బ్రహ్మ సమాజం తరుపున వెలువడే 'తత్త్వ బోధ ప్రకాశిక' అనే పత్రిక పాఠకులకు మాత్రమే దీనితో అనుబంధం ఏర్పడింది.
 జనగణమనకు ఆంధ్రాతో అనుబంధం
ఇప్పుడు అందరి నోటా రాగయుక్తంగా ఆలపించబడుతున్న 'జనగణమన'ను ఆంగ్లంలో అనువదించడమూ, దానిని స్వర పరచడం రెండూ మన ఆంధ్రరాష్ట్రంలోనే జరగడం ఎంతో గర్వకారణం. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలలో ఈ ప్రక్రియ సాగింది. 1919లో బెంగుళూరు వచ్చిన రవీంద్రుడు అదే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మదనపల్లెలోని బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలను సందర్శిం చాడు. ఆ కళాశాల నెలకొన్న వాతావరణం, ప్రకృతి శోభకు రవీంద్రుడు ఎంతగానో పులకించి పోయాడు. అదే సమయంలో అక్కడి విద్యార్ధులకు తాను రచించిన 'జనగణమన' గీతాన్ని నేర్పాడు. కళాశాల ప్రిన్సిపల్ జేమ్స్‌ కజిన్స్‌ కోరికపై జనగణమన గీతాన్ని 'మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా' అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ తర్జుమా ఒరిజినల్ ప్రతి ఇప్పటికీ మదనపల్లెలో బీసెంట్ దివ్యజ్ఞాన సమాజ కాలేజ్ లో భద్రంగా ఉంది. జేమ్స్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్  యూరోపియన్‌ సంగీత విద్వాంసురాలు, ఆమెతో కలిసి రవీంద్రుడు ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆ తరువాత కాలంలో 'జనగణమన' గీతం భారతీయ భాషలు అన్నిటిలోకి అనువదించబడింది.

వివాదాల సుడి
భరత జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఈ గీతం చుట్టూ కొన్ని వివాదాలూ ఉన్నాయి. 1911లో కింగ్ జార్జి-5 పట్టాభిషేక తరుణంలో తెరపైకి వచ్చిన ఈ గీతం ఆయనను కీర్తించేందుకు ఉద్దేశించినదేనన్నది ప్రధాన విమర్శ. 

ఆనాటి జార్జి చక్రవర్తి జార్జ్‌ భారత్‌ పర్యటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను కీర్తిస్తూ ఈ గేయాన్ని రచించారన్నది కొన్ని పత్రికలు విమర్శలు చేశాయి.గీతంలోని 'భారత భాగ్య విధాత.. అధినాయక' అనే పదాలు భగవంతుణ్ని ఉద్దేశించినవి కాదని, అవి కేవలం కింగ్ జార్జి-5ను కీర్తిస్తూ రాసినవన్న విమర్శలున్నాయి. తొలిసారి ఈ గీతాలాపన జరిగిన మర్నాడు పలు బ్రిటన్ పత్రికల్లో సైతం ఈ గీతం ఉద్దేశం అదేనంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను తర్వాత ఠాగూర్ నిర్ద్వంద్వంగా ఖండించారు. రవీంద్రుడు తన మిత్రునికి లేఖ రాస్తూ తన గేయంపై వచ్చిన విమర్శనాత్మక ప్రచారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు. తాను ఈ గేయంలో కేవలం జయాన్ని, భగవంతుని మాత్రమే కీర్తించానని తెలిపాడు. ఏ రాజుల కోసం, ఏ చక్రవర్తుల కోసమో, మరే పాలకుల కోసమో దీనిని తాను రచించలేదని కేవలం భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకునే రాశానని తన లేఖలో నిర్ద్వందంగా ఖండించాడు.
అలాగే ఈ గీతంలో పంజాబ, సింధు, గుజరాత, మరాఠ.. అంటూ సాగే రాష్ట్రాల పేర్లపైనా వివాదం ఉంది. అలనాటి సంస్థానాల ప్రస్తావనే అందులో లేదన్నది ప్రధాన అభ్యంతరం. విభజన అనంతరం పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిన సింధును తొలగించి, మన కాశ్మీర్‌ను గీతంలో చేర్చాలన్న డిమాండ్ ఉంది. అన్నిటినీ మించి స్వాతంత్య్ర సమరంలో ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన 'వందేమాతరా'న్ని కాదని 'జన గణ మన'ను జాతీయ గీతంగా ఆమోదించడం పట్ల కూడా పలు అభ్యంతరాలున్నాయి!!


జనగణమన గీతం విశ్వకవి ఆత్మనే కాదు యావత్‌ భారతదేశాత్మను కూడా నినదింపజేస్తోంది. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో గుర్తించింది. అతి విలువైన, అమూల్యమైన అవార్డు మన గీతానికి దక్కడం భారతీయులుగా మనకందరికీ గర్వకారణం. ఆ బాలగోపాలానికి ప్రీతిపాత్రమైన ఈ గీతాన్ని కలకాలం నిలుపు కుందాం. దేశం దశ దిశలా మారుమోగే ఈ సుందర గీతాన్ని గుండెగుండెలో నింపుకుందాం.జైహింద్.
 

Friday, January 21, 2011

మాచుపిచు (Wonder Of The World)






ఆకాశాన్నంటే శిఖరం...ఆపై భాగంలో అద్భుత నగరం. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తున అబ్బురపరిచే అపురూపమైన కట్టడాలు. మేఘాలు చేతికందే చోట ఔరా అనిపించే కోట. చుట్టూరా సహజసిద్ధంగా కొండలు, లోయలు. దిగువన ప్రవహించే సెలయేళ్లు, నదులు. పర్వతాగ్రాన అడుగడుగునా పనితనం ప్రతిబింబించే నిర్మాణాలు. గోడగోడల్లో పేర్చిన ప్రతిరాయలోనూ ఉట్టిపడే నైపుణ్యం. అదే పర్యాటకుల మనసు దోచే మాచుపిచు. పెరూ దేశంలోని శిథిల నగరం.

మాచుపిచు...అంటే పురాతన శిఖరం అని అర్థం. సముద్రమట్టానికి 2,430 మీటర్లు అంటే దాదాపు 80 వేల అడుగుల ఎత్తున ఉరుబంబా లోయల్లోని పర్వతాగ్రం ఇది. దక్షిణ అమెరికాలోని పెరుదేశంలో కుజ్ కో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఉంది.ఓ వైపు లోయ మరోవైపు పరవళ్లు తొక్కే ఉరుబంబా నదీ ప్రవాహం.
ఆ మధ్యలో ఎత్తైన పర్వతం మధ్య మాచుపిచు నగరం.15వ శతాబ్దంలో పెరూను పాలించిన ఇన్ కా సామ్రాజ్యపు నగరమే మాచుపిచు. క్రీ.శ. 1450 ప్రాంతంలో ఈ నగరాన్ని నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. వందేళ్ల తర్వాత 1572లో ఇన్ కా సామ్రాజ్యంపై స్పానిష్ దురాక్రమణలో ఇది నాశనమైంది.

ఈ శిథిల నగరాన్ని కనుగొన్నది అమెరికా చరిత్రకారుడు హిరామ్ బింఘమ్. కుజ్ కో నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశోధన జరుపుతున్న ఆర్కియాలజీ బృందాలకు మాచుపిచు నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించాయి.ఎన్నో వ్యయప్రయాసలకు గురైన పురాతత్వ బృందాలు ఉరుబంబా నది పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో ఏళ్లపాటు పరిశోధనలు సాగించారు. మాచుపిచు శిఖరం చేరుకోవడానికి వందల ఏళ్ల క్రితం నిర్మించిన దారులను కష్టంమీద కనుగొన్నారు. చివరికి వాళ్ల శ్రమ ఫలించింది. 1911లో హిరామ్ నేతృత్వంలోని పురాతత్వ బృందం అక్కడి అద్భత నిర్మాణాలను వెలికితీయగలిగింది. ఇన్కా సామ్రాజ్య వైభవాన్ని చాటే నిర్మాణాలతో పాటు దేవాలయాలు, నీటి వనరుల సద్వినియోగానికి ఇన్ కా రాజులు నిర్మించిన కట్టడాలు, సమాధులు..ఇలా ఒక్కో కట్టడం వెనక ఆసక్తికర విశేషాలు.

సంపూర్ణంగా ప్రశాంతత నిచ్చే నగరంగా మాచుపిచును టూరిస్టులు భావిస్తారు. సూర్య భగవానుని కోసంకట్టిన సన్ టెంపుల్ ఇక్కడ మెయిన్ ఎట్రాక్షన్. ఇక్కడి కట్టడాలను దేవతలు కట్టారని నమ్మేవారు కూడా ఎక్కువే.ఇక్కడి కట్టడాలు రహస్యాల మయం. నిటారుగా ఆకాశంలోకి దూసుకెళ్లిన పర్వత శిఖర భాగంలో పిరమిడ్ ఆకారంలో నిర్మించిన గుడి అందుకు నిదర్శనం. ఈ కట్టడం కోసం ఉపయోగించిన రాళ్లు టన్నుల కొద్ది బరువు ఉండటం ఒక వింతైతే వాటిని కచ్చితమైన కొలతలు, కోణాలతో సహా చెక్కి యుగాల తరబడి చెక్కు చెదరని రీతిలో పేర్చడం మరో ఎత్తు. అంతబరువైన రాళ్లను ఇంత ఎత్తుకు ఎలా చేర్చారు? అంత అద్భుతంగా ఎలా తీర్చిదిద్దగలిగారు? పక్కనే లోయల్లో ఉరుబంబా నదీ ప్రవాహం ఒడ్డున హాయిగా నివశించకుండా ఇంత ఎత్తులో నిర్మించాల్సిన అవసరం ఏంటి?
ఇలా మాచుపిచు అణువణువు రహస్యాల మయమే.

14,15 శతాబ్దాల్లో కుజ్కు రాజధానిగా ఉన్న పెరూ దేశాన్ని ఇన్కా రాజులు పాలించిన సమయంలో మాచుపిచు కేంద్రంగా వ్యవసాయ పరిశోధనలు జరిగి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రకృతి సిద్ధంగా నీటిని నిల్వ చేసే వ్యవస్థలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. మాచుపిచు పరిసర ప్రాంతాల తవ్వకాల్లో బయటపడ్డ మృణ్మయ పాత్రల నాణ్యత, వివిధ ఆకృతుల్లో వాటిని తయారు చేసిన పద్ధతులు నాటి ఇన్కా సామ్రాజ్యపు వైభోగాన్ని కళ్లకు కడతాయి.

మాచుపిచు నాగరికత ఎలా అంతరించింది
విషాదమేమిటంటే 15వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగిన ఇన్కా సామ్రాజ్యం స్పానిష్ దురాక్రమణలో ఉనికిని కోల్పోయింది. మాచుపిచు ఒక్కటే ఈ దాడులకు గురికాలేదని చరిత్రకారుల నమ్మకం. కానీ మశూచీ, పొంగు, విషజ్వరాలు వంటి జబ్బులకు తగిన మందులు లేక నాటి జనాభాలో 90 శాతం తుడిచిపెట్టుకుపోయింది.
1911లో చరిత్రకారుడు హీరామ్ బింఘామ్ ఈ ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత పెరూ దేశం మాచుపిచును తమ వారసత్వ సంపదగా ప్రకటించుకుంది. 1971లో మాచుపిచు చుట్టుపక్కల 325 చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్నంతా చారిత్రక, పవిత్రమైన ప్రదేశంగా పెరూ చట్టం చేసింది. 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా దక్కించుకున్న మాచుపిచు 2007లో ప్రపంచంలోని ఏడు వింత జాబితాలో చేరింది.

పర్యాటక కేంద్రం
హేతువాదులు, ఆధ్యాత్మకవాదులు,శాస్త్రవేత్తలు...ఈ మూడు వర్గాలకు కామన్ గా నచ్చే ప్రదేశాలు కొన్నే ఉంటాయి. అందులో మాచుపిచు ఒక్కటి. ఏటా కనీసం 8 లక్షల మంది టూరిస్టులు మాచుపిచును సందర్శిస్తుంటారు. వీరిలో విదేశీయుల సంఖ్య 5 లక్షలుగా ఉంటుంది. 90వ దశకంలో మాచుపిచు చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజుకు వంద మాత్రమే అది ఇప్పుడు 2 వేలకు చేరింది. కుజ్కో నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు అనేకం విలాసవంతమైన హోటళ్లుగా అభివృద్ధి చెందటంతో మాచుపిచు...పెరూ టూరిజం ప్రధాన వనరుగా మారింది.
రజనీ కాంత్ రోబో సినిమాలోని కిలిమంజారో అనే పాటను ఇక్కడే చిత్రీకరించారు. మాచుపిచులో మహా నిర్మాణాలు ఎలా సాధ్యమనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.



Friday, January 14, 2011

భూమ్మీదే కైలాసం

సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని..కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో.

మంచు కొండల్లో వెండివెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతుపట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని
అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం
ఈ భూమ్మీదే ఉంది.

సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి ( గంగానదికి ఉపనది)మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు అర్థంకాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడోవైపు ఏనుగుగా, నాలుగోవైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంకాగా, సింహం పార్వతి దేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమార స్వామి వాహనం.ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి.
మంచుపూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం.

కైలాస పర్వతాన్ని అపశవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంత మంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు మూడురోజుల సమయం పడుతుంది.

కైలాసాన్ని ఎవరూ అధిరోహించలేదా 
ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యంకాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలుపెట్టడం మహాపాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించాలని చెబుతారు. 1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది. రెండుసార్లు ఈ పర్వతం పైకి హెలికాఫ్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహనం చేయడం లేదు.ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటివరకు అవుటర్ సర్కిల్ లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్ లోకి వెళ్లిన వారు లేరు. ఈ పర్వత ఉపరి భాగంలో  ఏముందో సైన్స్ కు కూడా అంతుబట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ ను షహస్ర చక్రంగా పేర్కొన్నారు.
కైలాస పర్వత యాత్ర
భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.
మానస సరోవరం
కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు  కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. హర హర మహాదేవ శంభో శంకర.

Monday, January 10, 2011

మనిషి చిరుత వేగాన్ని అందుకుంటాడా ?

భూమ్మీద అన్ని జంతువుల కంటే వేగంగా  పరిగెత్తాలని మనిషి ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటివరకు అతనికి ఆ అవసరం కూడా రాలేదు. కానీ 100 మీటర్ల రేసు కోసం మనిషి తన వేగాన్ని పెంచుకుంటున్నాడు. రోజు రోజుకు మెరుగవుతున్నాడు. ఈ నిరంతర పోరాటం 5 సెకన్లలో 100 మీటర్ల దూరం పరిగెత్తే వరకు వెళ్తుందా ?  చిరుత వేగాన్ని మనిషి అందుకుంటాడా ?



ఉసేన్ బోల్ట్....ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషి. 100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ 9.58 సెకన్లలోనే గమ్యాన్ని చేరి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. బోల్ట్ వేగాన్ని చూస్తుంటే భవిష్యత్ లో మానవుడు చిరుత వేగాన్ని అందుకోగలడా అని అనిపిస్తుంది.

టెక్సాస్ కు చెందిన ప్రముఖ బయో మోకానిస్ట్ పీటర్ వియాండ్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. అయితే
ఈ స్వప్నం నెరవేరడం అంత సులభం కాదు. ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువుల్లో మనిషిది 28వ స్థానం. బోల్ట్ వేగాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మనిషి వేగం గంటకు 44 కిలోమీటర్లు.
భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. గంటకు 113 కిలోమీటర్ల వేగంతో చిరుత దూసుకుపోతుంది. రెండోస్థానం ఉత్తర అమెరికాకు చెందిన pronghorn antelope దీని వేగం గంటకు 98 కిలోమీటర్లు. ఆ తర్వాత స్థానాల్లో వైల్డ్ బీస్ట్, సింహం, లేడి ఉంటాయి. వీటి వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. గుర్రం గంటకు 76 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. 100 మీటర్ల రేసును ఐదు సెకన్లలో పూర్తి చేయాలంటే మనిషి వీటన్నింటినీ ఓడించి చిరుతతో పోటీపడాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టతరమైనది అయినా అసాధ్యమేమీ కాదు.

కాలంతో పాటు మనిషి వేగం కూడా పెరుగుతుంది.1912లో అమెరికాకు చెందిన డొనాల్డ్ లిపిన్ కాట్ 100 మీటర్ల రేసును 10.6 సెకన్లలో పూర్తి చేశాడు. 1960లోజర్మనీకి చెందిన ఆర్మిన్ హ్యారి దీన్ని 10 సెకన్లకు తగ్గించాడు. ఉసేన్ బోల్ట్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 9.72 సెకన్లతో మొదలైన బోల్ట్ ప్రస్థానం 9.58 సెకన్ల వరకు సాగింది.
అంటే వందేళ్ల కాలంలో మనిషి 1 సెకను మాత్రమే  తగ్గించగలిగాడు. మరి ఇది 5 సెకన్ల లోపు వరకు వెళ్తుందా ? చిరుతతో మనిషి పోటీపడతాడా ? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Sunday, January 9, 2011

Greatest Batsman ever: Bradman or Sachin

ప్రతీ క్రీడకు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ ఒకరు ఉంటారు. ఆ గేమ్ పేరు చెప్పగానే ముందుగా ఆ ఆటగాడి పేరే గుర్తుకు వస్తుంది. హాకీకి ధ్యాన్ చంద్, సాకర్ కు పీలే, మరి క్రికెట్ కు ఎవరు ? Sachin or Bradman ?

వేర్వేరు తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం సరికాకపోయినా క్రికెట్ లో All Time Great ఎవరనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. సచిన్, బ్రాడ్ మన్ లలో ఎవరు గొప్ప అనేది తేల్చాలంటే అంతర్జాతీయ క్రికెట్ లో వీరు సాధించిన గణాంకాలను ఒకసారి పరిశీలించాల్సిందే.

Career :

Bradman : బ్రాడ్ మన్ 1928 నుంచి 1948 వరకు అంటే 20 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు
Sachin : 1989లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్ 21 ఏళ్లుగా తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

Formats :

Bradman : బ్రాడ్ మన్ కాలంలో కేవలం టెస్టు క్రికెట్ మాత్రమే ఉండేది.

Sachin : సచిన్ కాలంలో టెస్టు, వన్డే, ట్వంటీ20 ఈ మూడు ఫార్మాట్లు రాజ్యమేలాయి. ఈ మూడింటిలోనూ మాస్టర్ పరుగుల వరద పారించాడు.






Fitness :

Bradman : 20 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో బ్రాడ్ మన్ ఆడింది కేవలం 52 టెస్టులు మాత్రమే. అంటే ఏడాదికి సగటున మూడు టెస్టులు.
Sachin : 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ లో సచిన్ 177 టెస్టులు, 442 వన్డేలు ఆడాడు. ఇంకా ఫిట్ నెస్ కాపాడుకుంటూ చెలరేగుతున్నాడు. సచిన్ ఏడాదికి సగటున 10 టెస్టులు, 32 వన్డేలు ఆడాడు. ఫిట్ నెస్ పరంగా చూస్తే సచినే గ్రేట్.

Runs : 

Bradman :  52 టెస్టుల్లో బ్రాడ్ మన్ చేసినవి 6996 పరుగులు.

 Sachin : సచిన్ 177 టెస్టుల్లో 14,692 పరుగులు, 442 వన్డేల్లో 17,598 పరుగులు చేశాడు. అంటే 32 వేలకుపైగా అంతర్జాతీయ పరుగులు సచిన్ ఖాతాలో ఉన్నాయి. సమీప భవిష్యత్ లో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డ్ ఇది.
 
Centuries : 

Bradman : టెస్టు కెరీర్లో బ్రాడ్ మన్ చేసిన శతకాల సంఖ్య 29.
Sachin :   టెస్టుల్లో 51 శతకాలు చేసిన సచిన్, వన్డేల్లో 46 సెంచరీలు కొట్టాడు. శతకాల సెంచరీకి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో సచిన్ చేసిన శతకాలే అతన్ని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాయి.

Average :

Bradman : బ్రాడ్ మన్ ఆల్ టైమ్ గ్రేట్ అనడానికి ముఖ్య కారణం టెస్టుల్లో అతను నమోదు చేసిన యావరేజ్.
99.94 సగటున బ్రాడ్ మన్ 52 టెస్టుల్లో 6996 పరుగులు చేశాడు. ఈ యావరేజ్ న భూతో న భవిష్యతి.
Sachin: టెస్టుల్లో సచిన్ సగటు 56.94 కాగా, వన్డేల్లో 45.12. వర్తమాన కాలంలో ఈ సగటు చాలా గొప్పదే.
Opposite Teams : 

Bradman : బ్రాడ్ మన్ కేవలం నాలుగు దేశాలపైనే క్రికెట్ ఆడాడు. అతను సాధించిన 6996 పరుగుల్లో 5 వేలకు పైగా రన్స్ ఒక్క ఇంగ్లండ్ పై చేసినవే.

Sachin: 12 దేశాలతో క్రికెట్ ఆడిన సచిన్ ...ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారించాడు

Stadiums :

Bradman : ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో కేవలం 10 స్టేడియాల్లో మాత్రమే బ్రాడ్ మన్ ఆడాడు.
Sachin: సచిన్ 8 దేశాల్లో 71 స్టేడియాల్లో టెస్టు క్రికెట్ ఆడాడు. స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా, ఫాస్ట్ ట్రాక్ అయినా, స్పిన్ స్వర్గధామం అయినా సచిన్ పరుగుల వరద పారించాడు. సచినే క్రికెట్ బాద్ షా అనడానికి ఇదీ ఒక కారణమే.
 Fast Bowlers :

 Bradman : బ్రాడ్ మన్ కాలంలో లార్ వుడ్ మినహా అంతగా భయపెట్టే ఫాస్ట్ బౌలర్లు ఎవ్వరూ లేరు.
 Sachin: షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, వసీం అక్రం లాంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను ఎందరినో సచిన్ ఎదుర్కొన్నాడు.


  Pressure :



 Bradman : ఒక్క బాడీలైన్ సిరీస్ మినహా బ్రాడ్ మన్ పై పెద్దగా ఒత్తిడి లేదనే చెప్పాలి.


 Sachin: వంద కోట్ల మంది భారతీయుల ఆశలను నిలబెట్టాల్సిన బాధ్యత సచిన్ ది. అందుకే క్రీజ్ లో దిగిన ప్రతిసారి మాస్టర్ పై ఒత్తిడి ఉంటూనే ఉంది. ఆ ఒత్తిడిని అధిగమించి సచిన్ పరుగుల వరద పారించాడు.

All Rounder :

Bradman : బంతితో బ్రాడ్ మన్ సత్తా చాటింది లేదు. టెస్టుల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు.
Sachin: బ్యాట్ తోనే కాదు బంతితోనూ సచిన్ రాణించాడు. టెస్టుల్లో 45, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు.  

Thursday, January 6, 2011

హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. " స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.
3. ధూపం

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
7 పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
8 పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
9 ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
11 కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

గణపతి ప్రార్థన

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

వక్రమైన తొండము కలవాడును, విశ్వమంతటిని తనలో నిముడ్చుకొనిన శరీరం కలవాడును, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడును అయిన నీకు నమస్కరించుచున్నాను. నేను చేయి ప్రతీ పనియు నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము.