Monday, January 10, 2011

మనిషి చిరుత వేగాన్ని అందుకుంటాడా ?

భూమ్మీద అన్ని జంతువుల కంటే వేగంగా  పరిగెత్తాలని మనిషి ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటివరకు అతనికి ఆ అవసరం కూడా రాలేదు. కానీ 100 మీటర్ల రేసు కోసం మనిషి తన వేగాన్ని పెంచుకుంటున్నాడు. రోజు రోజుకు మెరుగవుతున్నాడు. ఈ నిరంతర పోరాటం 5 సెకన్లలో 100 మీటర్ల దూరం పరిగెత్తే వరకు వెళ్తుందా ?  చిరుత వేగాన్ని మనిషి అందుకుంటాడా ?



ఉసేన్ బోల్ట్....ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషి. 100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ 9.58 సెకన్లలోనే గమ్యాన్ని చేరి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. బోల్ట్ వేగాన్ని చూస్తుంటే భవిష్యత్ లో మానవుడు చిరుత వేగాన్ని అందుకోగలడా అని అనిపిస్తుంది.

టెక్సాస్ కు చెందిన ప్రముఖ బయో మోకానిస్ట్ పీటర్ వియాండ్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. అయితే
ఈ స్వప్నం నెరవేరడం అంత సులభం కాదు. ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువుల్లో మనిషిది 28వ స్థానం. బోల్ట్ వేగాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మనిషి వేగం గంటకు 44 కిలోమీటర్లు.
భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. గంటకు 113 కిలోమీటర్ల వేగంతో చిరుత దూసుకుపోతుంది. రెండోస్థానం ఉత్తర అమెరికాకు చెందిన pronghorn antelope దీని వేగం గంటకు 98 కిలోమీటర్లు. ఆ తర్వాత స్థానాల్లో వైల్డ్ బీస్ట్, సింహం, లేడి ఉంటాయి. వీటి వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. గుర్రం గంటకు 76 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. 100 మీటర్ల రేసును ఐదు సెకన్లలో పూర్తి చేయాలంటే మనిషి వీటన్నింటినీ ఓడించి చిరుతతో పోటీపడాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టతరమైనది అయినా అసాధ్యమేమీ కాదు.

కాలంతో పాటు మనిషి వేగం కూడా పెరుగుతుంది.1912లో అమెరికాకు చెందిన డొనాల్డ్ లిపిన్ కాట్ 100 మీటర్ల రేసును 10.6 సెకన్లలో పూర్తి చేశాడు. 1960లోజర్మనీకి చెందిన ఆర్మిన్ హ్యారి దీన్ని 10 సెకన్లకు తగ్గించాడు. ఉసేన్ బోల్ట్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 9.72 సెకన్లతో మొదలైన బోల్ట్ ప్రస్థానం 9.58 సెకన్ల వరకు సాగింది.
అంటే వందేళ్ల కాలంలో మనిషి 1 సెకను మాత్రమే  తగ్గించగలిగాడు. మరి ఇది 5 సెకన్ల లోపు వరకు వెళ్తుందా ? చిరుతతో మనిషి పోటీపడతాడా ? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

No comments:

Post a Comment