Monday, August 29, 2011

హాకీ మాంత్రికుడు





క్రికెట్ పేరు చెప్పగానే జెంటిల్మన్ గేమ్ లో ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్ మన్ పేరు ముందుగా గుర్తుకు వస్తుంది.సాకర్ పేరు చెప్పగానే పీలే పేరు స్పురణకు వస్తుంది. మరి హాకీలో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరు...ఇంకెవరు మన భారతీయుడే...అతనే మేజర్ ధ్యాన్ చంద్.
హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దివిటీల సాయంతో సూర్యుడ్ని చూపించే ప్రయత్నమే. ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడోత్సవంగా జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది.ప్రపంచ దేశాలు హాకీలో ఓనమాలు దిద్దుకుంటున్న రోజుల్లోనే అసాధారణ ప్రతిభతో మేరుపర్వతంలా నిలిచిన ప్రజ్ఞావంతుడు ధ్యాన్ చంద్. హాకీ క్రీడకు అతను మారుపేరు. సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధీశాలి. 1928 ఆమ్‌స్టెర్‌డామ్, 1932 లాస్ ఏంజిలెస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టును విజేతగా నిలిపిన ఘనత నూటికి నూరుశాతం అతనిదే. ఆ ఒరవడినే భారత హాకీ జట్టు ఆతర్వాత కూడా కొనసాగించింది. 1948 లండన్, 1952 హెల్సిన్కీ, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకాలను కొల్లగొట్టింది. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో రజతంతో సరిపుచ్చుకున్నా, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి విజేతగా నిలిచింది. 1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను అందుకొని, 1980 మాస్కో ఒలింపిక్స్‌లో చివరిసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ధ్యాన్ చంద్ వేసిన బాట క్రమంగా చెదిరిపోగా, విశ్వవిజేతగా వెలుగొందిన భారత హాకీ పతనం ఆరంభమైంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సంపాదించలేని దుస్థితిని ఎదుర్కొంది. దేశంలో హాకీ ప్రాభవాన్ని కోల్పోయినా, ధ్యాన్ చంద్ మిగిల్చిన తీపి గుర్తులు ఇప్పటికీ అభిమానులకు స్ఫూర్తినిస్తున్నాయి. అతని పేరు తలచుకొని సగర్వంగా తలెత్తుకునే అదృష్టం భారతీయులకే సొంతం.
జాతీయ క్రీడగా హాకీని ఎంపిక చేయడానికి ధ్యాన్ చంద్ పరోక్షంగా కారణమయ్యాడు. ఆగస్టు 29న ధ్యాన్ చంద్ జయంతినే భారత జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటూ, ఇప్పటికీ అతనిని గుర్తుచేసుకోవడం మన అదృష్టం. నేటి ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905 ఆగస్టు 29న జన్మించిన ధ్యాన్ చంద్ తన కుటుంబంతోపాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి, చివరికి ఝాన్సీలో స్థిర పడ్డాడు. అతని తండ్రి సమేశ్వర్ దత్ సింగ్ భారత సైన్యంలో పని చేసేవాడు. తండ్రి బదిలీ అయిన ప్రతిసారీ, కుటుంబంతో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో, ధ్యాన్ చంద్ విద్యాభ్యాసం సక్రమంగా కొనసాగలేదు. కేవలం ఆరు సంవత్సరాలే అతను స్కూల్‌కు వెళ్లాడు.చిన్నతనం నుంచి రెజ్లింగ్ అంటే మక్కువ చూపిన ధ్యాన్ చంద్‌కు హాకీపై ధ్యాస ఉండేది కాదంటే ఆశ్చర్యం కలగక మానదు. తీరిక సమయాల్లో కాలక్షేపం కోసం ఝాన్సీ తరఫున హాకీ మ్యాచ్‌లు ఆడడం మినహా ఈ క్రీడను అతను ఎప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. 1922లో 16 సంవత్సరాల వయసులో ధ్యాన్ చంద్ కూడా సైన్యంలో చేరాడు. వ్యాయామ ప్రక్రియలో భాగంగా హాకీ ఆడే సమయంలో అతనిలోని నైపుణ్యాన్ని సుబేదార్ బాలే తివారీ కనిపెట్టాడు. తర్ఫీదిస్తే ఉత్తమ ఆటగాడిగా ఎదుగుతాడని అనుకున్నాడు. హాకీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. అతని అంచనా నిజమైంది. ధ్యాన్ చంద్ హాకీ స్టిక్‌తో అద్భుతాలు సృష్టించడం ఆరంభమైంది.
1922-1926 మధ్యకాలంలో అసాధారణ ప్రతిభ కనబరచి, భారత ఆర్మీ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లిన ఆ జట్టు 21 మ్యాచ్‌లు ఆడి, 18 విజయాలతో అదరగొట్టింది. రెండు మ్యాచ్‌లు డ్రాకాగా, ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది. ఆ వెనువెంటనే న్యూజిలాండ్ జాతీయ జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొని ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. మరో మ్యాచ్‌ని కోల్పోయింది. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ధ్యాన్ చంద్‌కు లాన్స్ నాయక్ హోదా లభించింది.
న్యూజిలాండ్ పర్యటన తర్వాత ధ్యాన్ చంద్‌కు వెనదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 1925లో భారత హాకీ సమాఖ్య ఏర్పాటైంది. యునైటెడ్ ప్రావీన్స్ (యుపి) తరఫున ధ్యాన్ చంద్ తొలి సివిలియన్ మ్యాచ్‌లు ఆడాడు. సెలక్టర్లను ఆకర్షించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 1928లో భారత హాకీ జట్టు తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6-0 తేడాతో గెలిచింది. ధ్యాన్‌చంద్ మూడు గోల్స్ సాధించాడు. ఆతర్వాత బెల్జియంపై ఒకటి, డెన్మార్క్‌పై మూడు, సెమీ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌పై నాలుగు చొప్పున గోల్స్ సాధించి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ 3-0 తేడాతో గెలుపొందింది. ధ్యాన్‌చంద్ రెండు గోల్స్‌తో రాణించాడు. భారత్‌కు తొలి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించాడు.
1932 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో భారత జట్టు 24-1 తేడాతో అమెరికాను చిత్తుచేసి సంచలనం సృష్టించింది. ధ్యాన్ చంద్ ఎనిమిది, అతని సోదరుడు రూప్ సింగ్ 10, గుర్మీత్ సింగ్ ఐదు గోల్స్ చేయగా, పినిగర్ ఖాతాలోకి ఓగోల్ చేరిం ది. అంతకు ముందు జపాన్‌ను 11-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఒలింపిక్స్‌కు ఆరంభానికి ముందు, ముగిసిన తర్వాత భారత జట్టు శ్రీలంక, అమెరికా తదితర దేశాల్లో పర్యటించింది. మొత్తం 37 మ్యాచ్‌లు ఆడింది. 34 విజయాలు సాధించింది. రెండు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ రద్దయింది. మొతతం 338 గోల్స్ సాధించింది. వీటిలో ధ్యాన్ చంద్ ఒక్కడే 133 గోల్స్ సాధించాడు. భారత జట్టులో అతను ఎంతటి కీలక పాత్ర పోషించాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ధ్యాన్ చంద్ ప్రాతినిథ్యం వహించిన ఝాన్సీ హీరోస్ జట్టు 1933లో బీటన్ కప్‌ను కైవసం చేసుకుంది. 1935లో లక్ష్మీబిలాస్ కప్‌ను గెల్చుకోవడంతోపాటు బీటన్ ట్రోఫీని నిలబెట్టుకుంది. 1934లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. మానవదార్ నవాబు ఈ టూర్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో ధ్యాన్ చంద్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. న్యూజిలాండ్‌లో 28 మ్యాచ్‌లు ఆడిన భారత్, ఆతర్వాత స్వదేశంలోనేగాక, సిలోన్ (ఇప్పటి శ్రీలంక), ఆస్ట్రేలియా దేశాల్లో మరో 20 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 48 మ్యాచ్‌లలో భారత జట్టు 584 గోల్స్ సాధించింది. వాటిలో ధ్యాన్ చంద్ 201 గోల్స్ నమోదు చేశాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో హంగరీని 4-0, అమెరికాను 7-0, జపాన్‌ను 9-0 తేడాతో ఓడించిన భారత్, సెమీ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై 10-0 తేడాతో విజయభేరి మోగించింది. మరోవైపు జర్మనీ లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకొని ఫైనల్ చేరింది. ఆగస్టు 15న జరిగిన ఫైనల్‌లో భారత్ 8-1 తేడాతో జర్మనీని చిత్తుచేసి ముచ్చటగా మూడోసారి ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ధ్యాన్ చంద్ మూడు గోల్స్ చేశాడు. అలీ దారా రెండు, రూప్ సింగ్ తాప్సెల్, జాఫర్ తలా ఒక గోల్‌తో రాణించారు. మొత్తం మీద మూడు ఒలింపిక్స్‌లో ధ్యాన్ చంద్ 12 మ్యాచ్‌లు ఆడి, 33 గోల్స్ నమోదు చేశాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో జాతీయ జట్టు నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ధ్యాన్ చంద్, 1956లో సైన్యం నుంచి పదవీ విరమణ పొందాడు.
1979 డిసెంబర్ 3న మృతి చెందిన ధ్యాన్ చంద్ భౌతిక కాయాన్ని ఝాన్సీ పట్టణంలోనే సైనిక లాంఛనాలతో ఖననం చేశారు. 1956లో ధ్యాన్ చంద్‌ను పద్మ విభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటి వరకూ హాకీలో ఈ అవార్డును అందుకున్న ఏకైక క్రీడాకారుడిగా ధ్యాన్ చంద్ పేరు రికార్డు పుస్తకాల్లో నిలిచిపోయింది. భారత హాకీకి, తద్వారా క్రీడా రంగానికి ధ్యాన్ చంద్ జయంతి రోజున అట్టహాసంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ధ్యాన్ చంద్ లేని భారత హాకీనిగానీ ఊహించడం కష్టం.
ధ్యాన్ చంద్ జీవితంలో ఆసక్తికర విషయాలు


* భారత జట్టు 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటి మ్యాచ్ ఆడిన వెంటనే ధ్యాన్ చంద్ ప్రతిభ అందరికీ తెలిసొచ్చింది. తర్వాతి మ్యాచ్ ఆరంభానికి ముందు జర్మనీ పత్రికలన్నీ ధ్యాన్ చంద్ ఆటనే ప్రత్యేకంగా ప్రస్తావించాయి. దీనితో భారత్ ఆడిన రెండో మ్యాచ్‌కి ప్రేక్షకులు ఎగబడ్డారు. వారి అంచనాలు తారుమారుకాలేదు. ధ్యాన్ చంద్ ‘మ్యాజిక్ స్టిక్’ విన్యాసాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి.
* ధ్యాన్ చంద్ అసాధారణ ప్రతిభ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయ. వాటిలో ఇదీ ఒకటి. ఒకసారి ప్రేక్షకుల నుంచి ఓ మహిళ హఠాత్తుగా మైదానంలోకి వచ్చి, ధ్యాన్ చంద్ కు తాను వాడే చేతి కర్ర అందించిందట. అతను వాడే స్టిక్‌లో ఎలాంటి మోసం లేదని నిరూపించుకోవాలంటే, చేతి కర్రతోనే ఆడి, గోల్స్ చేయాలని కోరిందట. హాకీ హీరో ధ్యాన్ చంద్‌కు అదో సమస్యగా తోచనే లేదట. ఆనందంతో ఆమె చేతి నుంచి కర్రను తీసుకొని ఆటను కొనసాగించాడట. అంతేకాదు.. అదే కర్రతో గోల్స్ చేసి ఔరా అనిపించుకున్నాడట.

* ధ్యాన్ చంద్ ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా గోల్ చేయలేకపోయాడు. గోల్స్ నమోదు కాకపోవడానికి గోల్‌పోస్టులో తేడా ఉండడమే కారణమని గ్రహించాడు. ఇదే విషయాన్ని రిఫరీ దృష్టికి తీసుకెళ్లాడు. గోల్ పోస్టును కొలిచి చూస్తే, ధ్యాన్ చంద్ అనుమానమే నిజమైంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టు గోల్ పోస్టు లేదని తేలింది. ఆటపై అతనికి ఉన్న పట్టుకు ఇదో ఉదాహరణ.
* ఆస్ట్రేలియా క్రికెట్ లెజెంట్ సర్ డొనాల్డ్ ఒకసారి ధ్యాన్ చంద్ ఆటను స్వయంగా చూశాడు. 1935లో భారత జట్టు ఆసీ స్ టూర్‌కు వెళ్లినప్పుడు అడెలైడ్‌లో ధ్యాన్ చంద్ మ్యాచ్ ఆడాడు. అతని ఆటను ఎంతో ఆసక్తిగా చూసిన బ్రాడ్‌మన్ అతనిని పొగడ్తల్లో ముంచెత్తాడు. క్రికెటర్లు పరుగులు సాధించినంత సులభంగా అతను గోల్స్ చేస్తున్నాడని ప్రశంసించాడు.
* ధ్యాన్ చంద్ ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతని హాకీ స్టిక్‌లో అయస్కాంతం ఉందేమోనని హాలెండ్ అధికారులకు అనుమానం వచ్చింది. అనుకున్నదే తడవుగా ధ్యాన్ చంద్ హాకీ స్టిక్‌ను తీసుకొని, విరగ్గొట్టి మరీ పరీక్షించారు. అయస్కాంతం లేదని తెలుసుకొని నాలిక కరచుకున్నారు

* 1932 ఒలింపిక్స్‌లో అమెరికాను భారత జట్టు 24-1 తేడాతో చిత్తుచేసింది. ధ్యాన్‌చంద్ సోదరుడు రూప్ సింగ్ ఈ మ్యాచ్‌లో పది గోల్స్ చేశాడు. ఒలింపిక్స్ హాకీ టైటిల్ పోరులో ఇంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా భారత్, అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రూప్ సింగ్ నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదర లేదు. ఆ మ్యాచ్‌లో అమెరికా ఒకే ఒక గోల్ చేసింది. మ్యాచ్ ముగింపు దశకు చేరిందన్న ధీమాతో భారత గోల్ కీపర్ రిచర్డ్ జేమ్స్ అలెన్ అభిమానులకు ఆటో గ్రాఫ్‌లు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు. అదే అవకాశంగా అమెరికా ఒక గోల్ చేసింది.
* మొక్కవోని ఆత్మవిశ్వాసానికి, తిరుగులేని దేశ భక్తికి మారుపేరు ధ్యాన్ చంద్. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి నాయకత్వం వహించిన అతను జర్మనీ నియంత అలాల్ఫ్ హిట్లర్‌కు వందనం చేయలేదు. లేత నీలం రంగు తలపాగా ధరించి, బంగారు రంగు దుస్తులతో వెలిగిపోయిన భారత బృందాన్ని ‘పెళ్లి బృందం’ అంటూ జర్మనీ మీడియా హేళన చేసింది. కానీ, ఈ బృందమే జర్మనీకి చెంపపెట్టు సమాధానం చెప్పింది.
క్రీడాకారులకు కూడా భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే...దేశ అత్యున్నత అవార్డ్ కు అన్ని విధాల అర్హత గల మొదటి క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్